ఓ వైపు కరోనా వైరస్ దేశంలో కలకలం సృష్టిస్తోన్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా విదేశీయులు వివిధ ప్రాంతాల నుంచి బయటకొస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పది రోజుల క్రితం వియత్నాం బృందం బైటపడింది. కాగా తాజాగా బర్మా దేశానికి చెందిన 17 మంది బృందం వెలుగులోకి వచ్చింది. దీనితో.. జిల్లా వాసులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. బర్మా నుంచి వచ్చిన 17 మందికి నల్గొండ ప్రార్థనా మందిరంలో స్థానికులు ఆశ్రయం కల్పించారు. కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. వారికి డీఎంహెచ్‌వో కొండల్ రావు, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేయగా.. కరోన లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా బర్మా బృందాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
దిల్లీలోని మర్కజ్‌కు నల్గొండ నుంచి 42 మంది వెళ్లారని వారిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించామని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నల్గొండ నుంచి ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని.. రాత్రనకా పగలనకా అధికారులు కరోనా కట్టిడికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సమీపంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో... క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం