తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను..... కుటుంబ సభ్యులు ఇరవై రోజుల కిందట బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి నిన్న తుది శ్వాస విడిచారు. 91సంవత్సరాల స్వరాజ్యం.. పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లు స్వరాజ్యం.. ఉమ్మడి రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మల్లు స్వరాజ్యం మరణం కుటుంబంతో పాటు సమాజానికి తీరని లోటని ఆమె కుమారుడు నాగార్జున రెడ్డి తెలిపారు.
పదమూడేళ్లకే తుపాకీ పట్టిన మల్లు స్వరాజ్యం
పదమూడేళ్లకే తుపాకీ పట్టి, పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడి స్వాతంత్రోద్యమ కాలం నాటి యువతను ఉర్రూతలూగించిన కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఆమె జీవితమంటే గత కాలపు తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్ర అనేంతగా సమాజంలో మమేకమయ్యారు. ఆ కాలంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణలతో ఆకట్టుకునే ఆమె అంటే సహచరులకే కాదు, నాయకులకూ అభిమానమూ, భయమూ రెండు ఉండేవి. అరమరికలు లేకుండా ఇతర నాయకులతో కంటే భిన్నంగా ఆమె అందరితో కలిసిపోయే మనస్తత్వం వల్ల ఇతర నాయకుల కంటే ఆమె భిన్నంగా కనిపించేవారు. అనేకానేక ప్రయోజనాలను ఆశించి రాజకీయాల్లోకి రాలేదామే. సంపన్న కుటుంబంలో పుట్టినా ఆ సౌకర్యాలన్నీ త్రుణప్రాయంగా త్యజించి సోదరుడు, సాయుధ పోరాట యోధుడు భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో తుపాకి పట్టిన కమ్యూనిస్టు దిగ్గజం స్వరాజ్యం.
దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటూ ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన స్వరాజ్యం సూర్యాపేట తాలుకా కర్విరాల కొత్తగూడెంలో ఐదారు వందల ఎకరాల భూస్వామి భీమ్‌రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మలకు మూడో సంతానంగా 1930లో జన్మించింది. ఆమెకు తల్లి తరఫు బంధువు ప్రభావంతో ఆమె తల్లి చొక్కమ్మ ఆనాటి స్వరాజ్యోద్యమ కాలాన్ని గుర్తుచేస్తూ ఆమెకు స్వరాజ్యం అని పేరు పెట్టారు. ఉద్యమ కాలంలోనే సూర్యాపేట తాలుకాలోని రాయినిగూడెం చెందిన మల్లు వెంకట నర్సింహారెడ్డి (వీఎన్)ని 1954లో వివాహం చేసుకుంది. వీఎన్ సైతం తెలంగాణ సాయుధ పోరాటంలో దళ కమాండర్‌గా పనిచేశారు. స్వరాజ్యంకు ఇద్దరు కుమారులు గౌతమ్‌రెడ్డి, నాగార్జునరెడ్డి ఉండగా, ఒక కూతురు కరుణ ఉన్నారు. గత కొంత కాలంగా ఆమె నల్గొండలోని చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి వద్దనే ఉంటున్నారు. ఆమె రాజకీయ వారసురాలిగా చిన్న కొడలు మల్లు లక్ష్మి 2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటుకు సీపీఎం తరఫున పోటీ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యేగా 1978, 83లో సీపీఎం తరఫున ఎన్నికైన స్వరాజ్యం ఎనాడూ ప్రజా ఉద్యమాలను వదలి రాలేదు. కమ్యునిస్టు దిగ్గజాలు రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వర్‌రావు, ఆరుట్ల కమళాదేవిల సమక్షంలో గెరిల్లా యుద్ధంలో శిక్షణ తీసుకుని దళ కమాండర్‌గా వ్యవహరించారు. దళ కమాండర్‌గా పనిచేస్తున్న స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేల నగదును ఇస్తామని 1940 ప్రాంతంలోనే నిజాం సర్కారు రివార్డును ప్రకటించింది. సాయుధ పోరాట విరమణ అనంతరం 1954లో ఆ రివార్డును ఎత్తేశారు.
అసెంబ్లీలోకి రానివ్వని బంట్రోతు
తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం తొలిసారి అసెంబ్లీలో ఎదరైన ఘటనను తన జీవిత చరిత్ర అయిన నా మాటే తుపాకీ తూటా పుస్తకంలో ఇలా వెల్లడించారు.
‘‘ అప్పటి మా పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే, సాయుధ పోరాటంలో నాకు సహచరుడు అయిన మద్దికాయల ఓంకార్‌తో కలిసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను. అక్కడికి రాగానే ఓంకార్ తనకు తెలిసిన మరో ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయారు. నేనూ లోపలికి వెళదామంటే అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి (బంట్రోతు) ‘‘ లోపలికి ఎమ్మెల్యేగా గెలిచినోళ్లే పోవాలే. ఎవరంటే వారు కాదు’’ అని ఆపారు. దీంతో చేసేదేమీ లేక కొద్ది సేపు వేచి చూస్తుండగా, మళ్లీ ఓంకార్ తిరిగి వచ్చి ఆ బంట్రోతుతో ‘‘ ఆమెను ఏమనుకున్నవ్. ఆమె మా నాయకురాలు. ఎమ్మెల్యేగా గెలిచి వచ్చింది’’ అని లోపలికి తీసుకుపోయిండు. అప్పుడు నాకు ఇంగ్లీషు రాదు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఓంకార్ చాలా సహాయం చేస్తుండే’’. అని వివరించారామే. ఎమ్మెల్యేగిరి అయ్యాక అందరిలాగా ఆమె ఇంట్లో కూర్చోలేదు. 1985 నుంచి 2005 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సంఘానికి కొంత కాలం పాటూ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1993లో సంపూర్ణ మద్య నిషేద ఉద్యంలో చురుకైన పాత్ర పోషించారు. తన 93 ఏళ్ల జీవితంలో దాదాపు 80 ఏళ్లు ప్రజా జీవితంలోనే గడిపిన మల్లు స్వరాజ్యం మరణం ఉమ్మడి జిల్లాతో పాటూ రాష్ట్రానికి తీరని లోటు అని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మల్లు స్వరాజ్యం పార్ధీవ దేహాన్ని ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు తరలిస్తారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం.........ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం పార్ధీవ దేహాన్ని నల్గొండకు తరలిస్తారు. నల్గొండ సీపీఎం కార్యాలయంలో సంతాప సభ తర్వాత పార్ధీవదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వనున్నారు. ఆమె తన మరణాంతరం పార్థీవ దేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి అందజేయాలని కోరినట్లు సీపీఎం నాయకులు తెలిపారు.
ఇదీ చూడండి: