Gutta Sukhender Reddy on TSPSC Paper Leakage : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కొందరు వ్యక్తులు చేసిన దుశ్చర్య అని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్న గుత్తా.. ఇందులో భాగంగానే గ్రూప్-1 ఇంటర్వ్యూను ఎత్తివేసిందని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చేస్తున్న నిరాధార ఆరోపణలు సరికాదని పేర్కొన్నారు. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేశంలో నియంత పాలన సాగుతోంది : కేసీఆర్ తర్వాత ఈ రాష్ట్రానికి కేటీఆరే అధినాయకుడని రేవంత్, బండికి అర్థమైందన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అందుకే కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని మళ్లీ దోచుకునే అవకాశం రాదనే దురాలోచన వారిదని ధ్వజమెత్తారు. దేశంలో నియంత పాలన సాగుతోందని.. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగలపై విచారణలు చేయకుండా.. లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
'టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కొందరు వ్యక్తులు చేసిన దుశ్చర్య. పేపర్ లీకేజీలో కేటీఆర్‌కు ప్రమేయం ఉందనటం సిగ్గుచేటు. సీఎం వద్ద నేను ఉన్నప్పుడే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ వచ్చారు. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు తొలగించాలని ఛైర్మన్‌కు సీఎం చెప్పారు. ఇంటర్వ్యూలు ఉంటే అవకతవకలు జరుగుతాయని తొలగించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటనలు దురదృష్టకరం. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేవు.'- గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
కొంత మంది స్వార్థం వల్ల పేపర్ లీకేజీ ఘటన జరిగింది : కేటీఆర్ అద్భుతమైన పని తీరుతో తెలంగాణలో ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని గుత్తా అభిప్రాయపడ్డారు. టీఎస్పీఎస్సీ నిబద్ధత గల సంస్థ అని తెలిపారు. కొంత మంది స్వార్థం వల్ల పేపర్ లీకేజీ ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దోషులపై కఠిన చర్యలు చేపట్టినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదనిపేర్కొన్నారు. అసత్యాలు ప్రచారం చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించింది : కేంద్రం ఇప్పటికైనా అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పనిగా కేంద్రం పెట్టుకుందని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టి అభివృద్ధిని గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాలనలో కక్ష సాధింపు ధోరణి మంచిది కాదనీ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: