ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న అస్పష్ట వాతావరణం నడుమ... నేరుగా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేపట్టిన పర్యటన సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగనుంది. తొలిరోజైన ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రం నుంచి మొదలై... సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వరకు కొనసాగనుంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండ, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో... భారీగా పంట సాగవుతుంటుంది. కానీ కొన్ని సీజన్ల నుంచి ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. అయితే వచ్చే యాసంగి నుంచి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా, ఉండవా అన్న మీమాంస నడుమ... భాజపా, తెరాస మధ్య నెలకొన్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలకు దిగుతూ... కొనుగోలు బాధ్యత మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... రైతులు అవస్థలు పడుతున్న ప్రాంతాల్లోనే సంజయ్ (state bjp president) పర్యటన సాగబోతోంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు... అధ్యక్షుడి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
నాలుగైదు రోజుల నుంచే..
నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 178 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం (grain purchasing centers) కాగా... మొత్తం 225కు గాను ఇంకా 47 మొదలు కావాల్సి ఉంది. అధికారికంగా 15 రోజుల క్రితం కొనుగోళ్లు మొదలైతే... గత నాలుగైదు రోజుల నుంచి వేగం పుంజుకున్నాయి. ఐకేపీ (ikp), పీఏసీఎస్ (pacs), మార్కెటింగ్ ఆధ్వర్యంలోని కేంద్రాల్లో ఇప్పటివరకు... 42,788 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. కానీ కల్లాల్లో మాత్రం పెద్దయెత్తున ధాన్యపు రాసులు పేరుకుపోయాయి.
అర్జాల బావి నుంచి నేరేడు చర్ల వరకు
నల్గొండ సమీపంలోని అర్జాలబావి ఐకేపీ కేంద్రంలో పెద్దయెత్తున రైతులు... అమ్మకాల కోసం నిరీక్షిస్తున్నారు. అక్కడ సంజయ్ పర్యటించి... రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడి మిర్యాలగూడ బయల్దేరి రైతులతోపాటు... మిల్లుల వద్ద చోటుచేసుకుంటున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో పర్యటిస్తారు.
ఆయా ప్రాంతాలే ఎందుకు
సరైన రీతిలో టోకెన్లు ఇవ్వట్లేదంటూ నేరేడుచర్లలో తరచూ రైతులు రోడ్డెక్కుతున్నారు. మండలంలో 10 వేల మందికి పైగా రైతులు ఉంటే... రోజుకు 40 చొప్పున మాత్రమే టోకెన్లు కేటాయిస్తున్నారు. అటు గరిడేపల్లి మండలంలోనూ ఇదే తీరు నెలకొంది. అక్కడ 16 వేల మందికిపైగా సాగుదారులు ఉంటే... అక్కడా టోకెన్లు 40కి మించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో... భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ఆయా ప్రాంతాల్లోనే కొనసాగనుండటం ఆసక్తికరంగా మారింది.
read also: Gangula on Paddy procurement: ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం: గంగుల