South India Travel Photographer Aravind : అరవింద్ ఏవీ ఒంటి పేరుకు ఇంటి పేరు ముడిపెట్టడం ఇష్టం లేక.. అమ్మ అంజమ్మ పేరు లోని మొదటి అక్షరాన్ని, నాన్న వెంకటయ్య పేరు మొదటి అక్షరాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న నేటి తరం కుర్రాడు. అమ్మానాన్నలే తన అస్థిత్వం అంటూ ఘంటాపథంగా చెబుతున్నఅరవింద్.. పాతికేళ్ల ప్రాయంలోనే యువ రచయిత, సాహిత్యాభిలాషి, ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాను తీసిన ఫొటోలను ప్రదర్శనకు ఉంచి పలువురి ప్రశంసలు అందుకున్నాడు
నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని మేడారం గ్రామంలో పుట్టిన అరవింద్‌కు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అభిరుచి ఇతడి భవిష్యత్‌కు కొత్తదారి చూపించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోని అనువాద నవలలూ చదివేవాడు. వాటి ప్రేరణతోనే ట్రావెలింగ్ ప్రారంభించాడు. ఫొటోగ్రఫర్‌గా మారాడు అరవింద్. తీసిన ఫొటోల్ని.., తాను చదివిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల ప్రదర్శించాడీ యువకుడు.
సరిలేరు సంగీతకు.. చదివింది నాలుగో తరగతి.. పది మందికి ఉపాధి కల్పిస్తోంది
"మా అమ్మ నేను ఫొటోలు తీస్తున్నప్పుడు అడ్డు చెప్పలేదు. దక్షిణ భారత్‌లో ఉన్న టూరిస్ట్ ప్రదేశాల గురించి నేను పుస్తకాల్లో ఏదైతే చదువుతున్నానో అదే నేను చూస్తున్నాను. ఈ ఊళ్లు, ప్రకృతి అంతా పుస్తకాల్లో ఉన్నట్లే ఉంది. వీటన్నింటిని నేచురల్‌గా ఫొటోలు తీసి అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఇలా తీసి డిస్ప్లేకి పెట్టాను. సాహిత్యం నన్ను నడిపించింది దాన్నే నేను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాను." - అరవింద్, యువ రచయిత
Travel Photographer Aravind Captures South India Landscapes : పర్షియన్ రచయిత రోమి చెప్పిన ఓ మాటతో ప్రయాణం ప్రారంభించాడు అరవింద్. నువు బయటికి వెళ్లేందుకు అడుగు వేస్తే చాలు.. ప్రపంచమంతా దారిస్తుంది అన్న ఆ మాటే తన ప్రయాణానికి స్ఫూర్తైంది అంటున్నాడు. జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ వద్ద రచయితగా పనిచేసే అవకాశం పొందాడు అరవింద్. 8 ఏళ్ల కిందట పుస్తక సమీక్షల్లో అనుదీప్ పరిచయం అయ్యాడు. వారిలో కామన్‌గా ఉన్న ఆ సాహిత్యాభిలాషే వారిని స్నేహితుల్ని చేసింది. అంతేగాక అరవింద్ యాత్రకు అనుదీప్ సహాయంగానూ నిలిచాడు.
ట్రావెలింగ్ చేయాలంటే దక్షిణ భారతదేశం నుంచి ప్రారంభించాలని అంటున్నాడు అరవింద్ . ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుంటే ట్రావెలింగ్‌లో రాణించవచ్చని చెబుతున్నాడు. దక్షిణ భారతంలో తిరుగుతూ తీసిన చిత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచాడు. వాటిని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి ఓల్గా, దర్శకుడు అనుదీప్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ సహా మరికొంత మంది ప్రముఖులు వీక్షించారు. అంతేగాక అరవింద్ ప్రతిభను ప్రశంసించారు.
"అతని అభిరుచుల గురించి అందరికి తెలుసు.. అది ఇక్కడ ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్న ఫొటోలు కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకు ఏదో ఒకదానికి సాక్ష్యంగా నిలుస్తాయి. అరవింద్ తన లైఫ్‌లో ఇలానే ముందుకెళ్లాలి అనుకుంటున్నాను." - ఓల్గా, రచయిత్రి