నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండా తండాకు చెందిన రమావత్ సువర్ణ (24) చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడింది. కాళ్లు, చేతులు కదపలేని సువర్ణ.. ఏ పని చేయాలన్నా.. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే! అయినా ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఎవర్నీ కష్టపెట్టకుండా జీవించాలనుకుంది.
మూడేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. పనికెళితేనే పూట గడిచేది. అయినప్పటికీ బిడ్డను అలా వదిలెళ్లలేక.. ఇంటివద్దే ఉంటూ చూసుకునే వారు. ఆ సమయలో కుటుంబ పోషణ మరింత భారమైంది.
తల్లిదండ్రులకు భారం కావొద్దని భావించిన సువర్ణ.. బొమ్మలపై శ్రద్ధ పెట్టింది. చేతులు కదలకున్నా వేళ్ల సాయంతో చిన్నచిన్న బొమ్మలు గీస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. చిత్రాలతో వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవితల బొమ్మలను గీసి, వాటిని వేలం పెట్టింది. మూడున్నర లక్షలు అర్జించింది. ఆ డబ్బుతో ఓ ఇల్లు నిర్మించుకుంది. ఈ మధ్యకాలంలోనే మహేంద్ర కంపెనీ అధినేత బొమ్మను గీసినందుకు గాను ఆయనే స్వయంగా వచ్చి రూ. 75 వేలకు ఆ చిత్రాన్ని కొనుగోలు చేశాడు.
సర్కారు కాస్త ప్రోత్సహిస్తే మరింత అద్భుతంగా బొమ్మలు గీస్తానంటోంది సువర్ణ. ఎందరికో ఆదర్శమైన సువర్ణను ప్రోత్సహించడం ఎంతో అవసరం.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్