ఉద్యోగ రీత్యా ఏ ప్రాంతంలో స్థిరపడినా చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలంటే అందరికీ ఓ మధుర జ్ఞాపకమే. చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన కుంభం ఇంద్రా రెడ్డి. వైద్యుడిగా భాగ్యనగరంలో స్థిరపడినా ఊరిలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సాయం చేస్తున్నాడు. పిల్లలకు సైన్స్‌పై అవగాహన కలిగించేందుకు, గణితం సులభంగా అర్థమయ్యేందుకు పరికరాలు సమకూర్చాడు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి పంపిణీ చేశాడు. తరగతి గదుల్లో కూర్చునే విధంగా బెంచీలు సమకూర్చాడు.
పూర్వ విద్యార్థి బాటలో స్థానికులు
ఇతను చేస్తున్న సేవను చూసి కొందరు స్థానికులు కూడా ముందుకొచ్చారు. పాఠశాల ఆవరణలో కళాప్రాంగణం నిర్మించారు. పాఠశాలకు గేటు నిర్మించారు. పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి కూడా సమకూర్చి ఈ పాఠశాలను మండలంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానంటున్నాడు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ఇంద్రారెడ్డి.
ఇదీ చూడండి: అధికారులకు గ్రామస్థులు తోడయ్యారు.. అందరికీ ఆదర్శమయ్యారు!