RS Praveen Kumar election campaign in munugodu: ఏళ్లుగా ఆధిపత్య వర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయిందని, అక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాలని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించినా మళ్లీ దొరల చేతికే పాలన పోయిందనని ఆయన ఎద్దేవా చేశారు. బడా పారిశ్రామిక వేత్తలకు దళితులు, పేద ప్రజల భూములను ప్రభుత్వం కట్టబెడుతోందని ఆయన విమర్శించారు.
కేసీఆర్తో అభివృద్ధి జరిగింది ఫాంహౌస్, వారి కుటుంబ ఆస్తులే: భూములను గుంజుకుంటున్న పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్తో అభివృద్ధి జరిగింది ఆయన ఫాంహౌస్, వారి కుటుంబ సభ్యుల ఆస్తులేనని ఆయన ఆరోపించారు. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ధ్వజమెత్తారు.
పేదల పక్షాన నిలబడే పార్టీ బీఎస్పీ: పేదలకు అండగా ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే మతతత్వ పార్టీని తీసుకొచ్చి తనను గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి ఆధిపత్య వర్గాల పార్టీలకు ఓటేస్తే మనకు ఇలాంటి తిప్పలు ఎన్నేళ్లైనా తప్పవని ఆయన అన్నారు. పేదల పక్షాన నిలబడే పార్టీ బీఎస్పీ ఒక్కడే అని చెప్పుకొచ్చారు. ఈసారి మునుగోడులో బీఎస్పీ పార్టీ నిలబడుతుందని ఓ బహుజన బిడ్డనే నిల్చోబెడతామని ఆయన ప్రకటించారు.
మునుగోడులో బీఎస్పీ గెలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఓట్లను దోపిడీ చేసిన డబ్బుతో బీర్లు, బిర్యానీలతో ఆధిపత్య పార్టీలు కొనాలని చూస్తున్నాయని అది మన బహుజన బిడ్డలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. బీఎస్పీ చేపట్టిన రెండో విడత పాద యాత్ర మునుగోడు నుంచే ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు.
"ఆధిపత్య వర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయింది. ఇక్కడ బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారో ప్రశ్నించుకోవాలి. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చేప్పాల్సినా అవసరం ఉంది. ఈసారి మునుగోడులో బీఎస్పీ పార్టీ నిలబడుతుంది. బహుజన బిడ్డనే ఎన్నికల బరిలో నిలబెడతాం.. బీసీల నిజమైన రాజ్యాధికారం బీఎస్పీ ద్వారానే సాధ్యం.. ఎందుకు బీసీ కార్పోరేషన్లు నిధులు ఇవ్వలేదు. తెరాస పార్టీలో ఉన్న బీసీలు వారి ప్రయోజనాలు కోసమే చూసుకుంటున్నారు."- ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: