ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల శాతం క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే మూడు నెలల లాక్‌డౌన్ ముగిసిన అనంతరం ప్రమాదాలు, మృతుల శాతం క్రమంగా పెరిగిందని పోలీసులు వెల్లడించిన గణాంకాల ద్వారా తేటతెల్లం అవుతోంది. ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్ 65) 190 కి.మీ. మేర, హైదరాబాద్-వరంగల్ (ఎన్‌హెచ్-163) 48 కి.మీ. మేర ఉంది. వీటితో పాటూ నార్కట్‌పల్లి-అద్దంకి (ఎస్‌హెచ్-2) రాష్ట్ర రహదారి 90 కి.మీ. మేర నల్గొండ పరిధిలో ఉంది. ఈ మూడు రహదారుల్లో ఎక్కువగా ఎన్‌హెచ్ 65పైనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారులపై గుత్తేదారు సంస్థల పర్యవేక్షణ లోపం, స్పీడ్‌గన్లు ఉపయోగించకపోవడం, వేగ నియంత్రణలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అధికారులకు, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మధ్య సమన్వయ లోపం, మితిమీరిన వేగం, తదితర కారణాలు ప్రమాదాలు పెరగడానికి దోహదమవుతున్నాయి. గతంలో ఒక్క ఎన్‌హెచ్ 65పైనే మొత్తం 21 చోట్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని (బ్లాక్‌స్పాట్స్) గుర్తించినా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని వై జంక్షన్ వద్ద మాత్రమే పైవంతెనను గుత్తేదారు సంస్థ నిర్మిస్తోంది. మిగిలిన చాలా చోట్ల రహదారి మరమ్మతులు జరగాల్సి ఉంది.
జాతీయ రహదారి ప్రారంభం కంటే ఇప్పుడు దాదాపు 30 శాతం ప్రమాదాలు తగ్గాయి. రహదారి నిర్మాణంలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, పెట్రోలింగ్ పోలీసులతో కలిసి సవరిస్తున్నాం. అందులో భాగంగానే నార్కట్‌పల్లి వద్ద ఫ్లైఓవర్, ఇనుపాముల వద్ద అండర్‌పాసు నిర్మించాం. మరిన్ని బ్లాక్‌స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
శ్రీధర్‌రెడ్డి, మేనేజరు, ఎన్‌హెచ్ 65 గుత్తేదారు (జీఎమ్మార్) సంస్థ
చర్యలు చేపట్టినా...
జాతీయ రహదారులతో పాటూ నార్కట్‌పల్లి-అద్దంకి, హైదరాబాద్-సాగర్ రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట గతేడాది చర్యలు చేపట్టారు. జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, బుల్‌రాడ్స్, జిగ్‌జాగ్ లాగా రహదారిని దిగ్బంధం చేయడం, ప్లాస్టిక్‌తో ప్రమాద స్థలాల్లో వేగ నియంత్రికలను ఏర్పాటు చేయడంతో గతేడాది కొంత ప్రమాదాల శాతం తగ్గింది. కొత్త సాంకేతికతతో ప్రమాదాల శాతం తగ్గగా... ఇప్పుడు మళ్లీ పెరగడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారుపై గుత్తేదారు సంస్థ టోల్ వసూలు చేస్తున్నా చాలా చోట్ల ఇప్పటికీ సర్వీసు రహదారులను నిర్మించలేదు. తిప్పర్తి వద్ద బైపాస్ రోడ్డు పనులు చేయాల్సి ఉంది. దీంతో ప్రమాదాల శాతంతోపాటే మృతులు పెరుగుతున్నారు.
ఇటీవల దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద అంబులెన్స్‌ను మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించడం ఆ పైవంతెనపై చీకటిగా ఉండటమే కారణమని నిపుణులు ప్రాథమికంగా నిర్ధరించడం గమనార్హం. తాజాగా ఎన్‌హెచ్ 163పై డిజిటల్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తుండటంతో కొంత ప్రమాదాల శాతం తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దానిని ఎన్‌హెచ్ 65పైనా అమలు చేస్తే చాలా కుటుంబాలకు మృత్యుఘోష తప్పే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేస్తున్నందువల్ల ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ సహకారం అందిస్తే త్వరితగతిన జాతీయరహదారులపై డిజిటల్ సైన్‌బోర్డులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు