Rajagopal Reddy nomination: అన్నిపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీగా తరలివెళ్లి చండూరులో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. అంతకుముందు చండూరులోని బంగారిగడ్డ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. విజయం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటకలిపేలా పార్టీలో తెలంగాణ పేరును తీసేశారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ అహం భావాన్ని అణగదొక్కడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈసారి పోటీ మునుగోడు ప్రజలు.. కేసీఆర్ అహంకారానికే మధ్యే ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో మునుగోడు ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు మునుగోడు నుంచే చరమగీతం పాడబోతున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఈసారి మునుగోడు ఫలితాలు సీఎం చెంప చెల్లుమనిపించేలా ఉంటాయని జోస్యం చెప్పారు. అధికార తెరాస పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నికల్లో కమలం గెలుపును ఆపలేరని నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: