ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. నల్గొండలో 7, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, సూర్యాపేటలో 5 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ... పోలింగ్ సిబ్బందికి... సామగ్రి పంపిణీ చేయటంతోపాటు శిక్షణ ఇచ్చారు.. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్వోలు, నోడల్ అధికారులు... ఇప్పటికే స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
భద్రతా బలగాల మోహరింపు...
నల్గొండ జిల్లాలో 162 వార్డులకు గానూ 456 పోలింగ్ కేంద్రాలుండగా... 2 లక్షల 82 వేల 379 మంది ఓటర్లున్నారు. అందులో 81 కేంద్రాల్ని సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.
సూర్యాపేట జిల్లాలో 141 వార్డులకు గానూ 339 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా... 2 లక్షల 7 వేల 876 మంది ఓటర్లున్నారు. ఈ జిల్లాలోని 57 సమస్యాత్మక కేంద్రాల్లో... భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదాద్రి జిల్లాలో 104 వార్డులకు గాను 211 పీఎస్ లు ఉండగా... లక్షా 18 వేల 876 మంది ఓటర్లున్నారు. అందులో మిగతా రెండు జిల్లాల కంటే అత్యధికంగా... 120 సమస్యాత్మమైన కేంద్రాలున్నాయి. పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా... భారీగా భద్రతాబలగాలు మోహరించాయి.
వి.చంద్రశేఖర్, ఇంఛార్జి కలెక్టర్, నల్గొండ జిల్లా
సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద... రిజర్వ్ విభాగాలతోపాటు పారా మిలిటరీ బలగాల్ని అధికారులు రంగంలోకి దింపుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.