నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నిండి.. మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలో చెరువు పరిధిలోని పలు కాలనీలు వరద నీటి ఉద్ధృతికి నీట మునిగాయి. దేవరకొండ, మిర్యాలగూడ వెళ్లే దారిలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన మట్టి బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు పెద్దమొత్తంలో ప్రవహించడం వల్ల.. రామాలయం వీధిలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ఇంట్లోని బట్టలు, సామాన్లు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆదుకోండి సారూ..
వరద నీటి ఉద్ధృతికి ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయి నేలమట్టమయ్యాయి. 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దసరా సమీపిస్తున్న తరుణంలో బట్టల వ్యాపారులు, చేతివృత్తుల వారు, స్వర్ణకారుల వస్తువులు, సామాన్లు నీటి పాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.