Nagarjuna sagar Lands Illegal Occupation : నల్గొండ జిల్లా నందికొండ పురపాలిక ఏర్పాటుకు ముందు స్థలాలన్నీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణలో ఉండేవి. పురపాలిక ఏర్పాటు తర్వాత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్‌కి సంబంధించిన క్వార్టర్స్‌లలో ఏళ్లుగా ఉంటున్న వారికి నామమాత్ర రుసుముతో వాటిని క్రమబద్దీకరణ చేస్తామని గతేడాది ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే అదనుగా అక్కడున్న రాజకీయ నేతలు, వారి బంధువులు, చోటామోటా కార్యకర్తలతో పాటు ఉమ్మడి జిల్లాలోని కీలక నాయకులు రంగంలోకి దిగారు. ఎవరికి వారు నందికొండ పురపాలిక పరిధిలో ఖాళీ స్థలం కనిపిస్తే అందులో ఏదో ఒక చిన్న చిన్న కట్టడాలు చేయడం మొదలుపెట్టారు. విజయ్‌విహార్ హోటల్ నుంచి పైలాన్ కాలనీలోని కొత్త వంతెన వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారు. స్థానిక నేతల మద్దతుతో క్రయవిక్రయాలు జరుగుతుండటం గమనార్హం.
బడా నేతల సాయంతో ఆక్రమణలు!
కొందరు బడా నేతలు బినామీల ద్వారా స్థలాలను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలు, గిరిజనులకు చెందిన నిర్మాణాలనే అధికారులు కూల్చివేస్తున్నారని, నేతల దన్ను ఉన్న వారి జోలికి వెళ్లడం లేదని గిరిజన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేయడమే తప్పంటే....ఏకంగా వందల గజాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించి నాయకుల దన్నుతో వెంచర్లు ఏర్పాటు చేసి కోట్లు గడిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించని వారిపై అధికార యంత్రాంగం కొరడా ఝులిపిస్తోంది. క్వార్టర్స్‌ను ఎలాంటి నిబంధనలు లేకుండా కొందరు నాయకులు దక్కించుకోవడంపై స్థానిక నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ వారికే క్వార్టర్స్ కేటాయించాలని యంత్రాంగంపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టరును అధికారులు ఆశ్రయించగా మొత్తం అక్రమ నిర్మాణాలతో పాటూ ఇది వరకు కేటాయించిన క్వార్టర్స్‌పైనా సమగ్రంగా నివేదిక ఇవ్వాలని స్థానిక యంత్రాగాన్ని ఆదేశించినట్లు సమాచారం.
ఇక్కడ పేద, గిరిజన తరగతుల వారు ఉండటానికి నిర్మించుకున్న కట్టడాలనే అధికారులు కూల్చుతున్నారు. నేతల దన్నుతో వందల గజాల్లో ఆక్రమించుకున్న బడాబాబుల జోలికి వెళ్లడం లేదు. కూలిస్తే అందరివీ కూల్చాలి తప్పితే పేదవారిపైనే అధికారులు ప్రతాపం చూపడం తగదు.
-శంకర్‌నాయక్, గిరిజన సంఘం నేత
ఇక్కడ అక్రమ నిర్మాణాలు గత కొంతకాలంగా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటన్నింటినీ కూల్చేస్తున్నాం. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేసిన 14 మందిని గుర్తించి... వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. తక్కువ ధరకే ఇక్కడ ప్లాట్లు ఇప్పిస్తామనే దళారుల మాటలకు ప్రజలు మోసపోవద్దు. అలాంటివి ఉంటే మా దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-ఎస్. సైదులు, తహసీల్దార్, పెద్దవూర
నందికొండ మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలు గత కొంత కాలంగా కబ్జా అవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని గుర్తించి... కూల్చివేసి కేసులు నమోదు చేస్తున్నాం. గతంలోనూ కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు వెలిశాయి. ఇంకా ఉంటే వాటినీ గుర్తించి కూల్చివేస్తాం.
-రవీందర్‌రెడ్డి, పుర కమిషనర్, నందికొండ మున్సిపాలిటీ
ఇదీ చదవండి: Pollution: నిబంధనలకు నీళ్లొదలిన ఫార్మా కంపెనీలు.. కాలుష్య కోరల్లో పల్లెలు