నల్గొండ జిల్లాలో 40 ఏళ్ల కిందట సమితికి 10 నుంచి 15 వరకు సహకార భవనాలు, సంఘాలు ఉండేవి. 1983లో అప్పటి ప్రభుత్వం మండల వ్యవస్థను తీసుకొచ్చి, మండలానికి ఐదు వరకు సహకార భవనాలుగా విభజించారు. ఒక్క మండలానికి ఇన్ని భవనాలు, సహకార సంఘాలు నిరుపయోగం అని భావించి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున కుదించారు. మిగతావాటిని దేనికైనా ఉపయోగించాలని భావించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని విస్మరించాయి. ప్రస్తుతం వాడుతున్న భవనాలు పోను, సుమారు మరో 349 భవనాలు నిరుపయోగంగా మారాయి.
ఆక్రమణలకు గురవుతున్నా...
ఒక్కో సహకార సంఘానికి సుమారుగా 10 గుంటల స్థలం, భవనం ఉన్నాయి. వీటిపై అధికారులు, పాలకుల దృష్టి లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇళ్ల స్థలాలు, భూములకు రెక్కలొచ్చాయి. ఆక్రమణదారులు కొన్నింటిని రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేస్తున్నారు. మరికొన్నింటిని ప్రైవేటు వ్యక్తులు అనుమతులు లేకుండానే వాడుకుంటున్నారు. ఉదాహరణకు కొద్ది నెలల కిందటి వరకు నల్గొండ మండలం దోమలపల్లి సహకార భవనాన్ని కొందరు వ్యక్తులు ప్రైవేటు శిక్షణ కేంద్రంగా నిర్వహించారు. సహకార స్థలంలోనే అదనపు గదినీ నిర్మించారు. నల్గొండ సమీపంలోని కేశరాజపల్లి సహకార భవనాన్ని ఎవరూ పట్టించుకోక శిథిలావస్థకు చేరింది. ఉమ్మడిజిల్లాలో సుమారు 100 భవనాలది ఇదే పరిస్థితి.
ఆస్తుల విలువ రూ. కోట్లలోనే
ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థలాలకు డిమాండు పెరిగింది. జాతీయ రహదారులు, పట్టణాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 10 గుంటల స్థలం విలువ రూ.50లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉంది. ఇలాచూస్తే ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల నిరర్థక ఆస్తుల విలువ సుమారు రూ.180కోట్ల నుంచి రూ.220 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను గోదాములుగా మారిస్తే తమకు ఉపయోగపడతాయని అన్నదాతలు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు నిల్వచేసుకునేందుకు అనుమతిస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయపడుతున్నారు.
ఖాళీ భవనాలను గోదాములుగా మార్చాలి
- రంగారెడ్డి, గుట్టకింద అన్నారం, నల్గొండ జిల్లా
ప్రస్తుతమున్న భవనాలను ఇలాగే వదిలేస్తే ఎవరికీ ఉపయోగపడకుండా శిథిలావస్థకు చేరతాయి. ఇప్పటికైనా పాలకులు, సహకార అధికారులు సమన్వయంతో వీటిని రైతులకు ఉపయోగపడేలా గోదాములుగా మార్చితే బాగుంటుంది. కనీసం ఈ వానాకాలంలోనైనా ఎరువులు నిల్వచేసుకునేందుకు మరమ్మతులు చేయించాలి.
త్వరలోనే మనుగడలోకి తెస్తాం
- గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్, నల్గొండ
ఉమ్మడి జిల్లాలో నిరుపయోగంగా ఉన్న సహకార భవనాల పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే మరమ్మతులు చేయించి అన్నదాతలకు ఉపయోగపడేలా గోదాములుగా, ఇతర వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెస్తాం. మూడు జిల్లాల సహకార అధికారులు కూడా ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు.