Rajagopal Reddy issue: రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఆయన పార్టీ వీడకుండా ఉండేందుకు హస్తం నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇతర నేతలకైతే ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు. కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభావితం చేయగలిగే కోమటిరెడ్డి సోదరులు కావడంతో.. అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి భాజపా తరఫున మునుగోడు నుంచి బరిలో నిలిస్తే అనుసరించాల్సిన వ్యూహంపైనా అధిష్టానం చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ మారితే.. కనీసం కేడర్ లేనిచోట అనవసరంగా భాజపాకు స్థానం కల్పించినట్లవుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోనే కొనసాగించాలని.. అలకకు కారణాలు తెలుసుకొని సంప్రదింపులు జరపాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి శనివారం రాజగోపాల్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు.
కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పర్యటన తర్వాత దిల్లీ వెళ్తానని ప్రకటించారు. ప్రజలు కోరుకుంటే ఉపఎన్నిక వస్తుందని.. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం బాధ్యత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధిష్ఠానం అప్పగించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా పేర్కొన్న రేవంత్.. పార్టీని కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కొందరు నాయకులు ఏఐసీసీకి ప్రతిపాదించారు.
ఇవీ చూడండి..
మీ నిర్ణయమే ఫైనల్.. అలా అయితేనే పోటీ చేస్తా: రాజగోపాల్ రెడ్డి
'రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడరు.. ఉపఎన్నిక రాదు'
'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్.. తిరుగులేని సాక్ష్యం కాదు'