చుట్టూ దట్టమైన అటవీప్రాంతం.. నడుమ కృష్ణమ్మ పరుగులు.. అక్కడక్కడా జలపాతాల హోరుతో ప్రకృతి పర్యాటకానికి స్వర్గధామం లాంటి నల్లమల అభయారణ్యంలో వ్యన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ విషయాన్ని అటవీశాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.
అలరారుతోన్న నల్లమల..
జీవవైవిధ్యంతో అందాల నల్లమల అలరారుతోంది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, చుక్కల దుప్పులు, అడవిపందులు, సాంబార్, లంగూర్.. ఇలా అనేకరకాల వన్యప్రాణులు, వందల రకాల పక్షిజాతులు సంచరిస్తున్నాయని పేర్కొంది. ఈ నివేదికను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ అరణ్యభవన్‌లో శుక్రవారం విడుదల చేశారు.
ఏఏ జంతువులున్నాయ్..
అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్) పరిధి 2,611 చ.కి.మీ. జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) మార్గదర్శకాలను అనుసరించి ప్రతి సంవత్సరం ఇక్కడి అభయారణ్యంలో పులులు, వన్యప్రాణులను లెక్కిస్తారు. ప్రత్యక్షంగా కనిపించినవి, నీటి కుంటల వద్ద కెమెరాల ద్వారా గుర్తించిన వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా 14 పెద్ద పులులను, 43 రకాల వన్యప్రాణుల్ని గుర్తించినట్లు నివేదికలో అటవీశాఖ పేర్కొంది. నిజానికి నల్లమలలో 18కి పైగా పెద్ద పులులున్నాయి. అమ్రాబాద్‌లో ఆవాసం చేసుకున్నవాటిలో అరుదైన హనీబాడ్జర్ వంటి జంతువులూ ఉన్నట్లు అటవీశాఖ వెల్లడించింది. పెద్ద పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీసీఎఫ్ శోభ తెలిపారు. శాఖాహార జంతువుల లభ్యత కూడా పెరిగినట్లు ఈ నివేదిక సూచిస్తోందన్నారు.
ఇదీచూడండి: Water Disputes: జల్‌శక్తి శాఖ గెజిట్‌కు ఏపీ సై.. పోరాడాలన్న సీఎం కేసీఆర్