అద్భుత నైపుణ్యాలతో జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా చేనేత కార్మికులు... ఇప్పుడు పూట గడవని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ అమలు నుంచి పనులు నిలిచిపోవడం వల్ల... మగ్గాన్నే నమ్ముకున్నవారంతా దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిని ఇంటిల్లిపాది పస్తులుంటున్నారు. అటు కార్మికులు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తిత్వం వహించే సహకార సంఘాలు... చేతిలో డబ్బుల్లేక నిర్వీర్యమయ్యే స్థితికి చేరుకుంటున్నాయి.
ఆదుకున్న చేయ్యే... చెయ్యి చాచే పరిస్థితి
ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మొదటిసారిగా చేనేత సహకార సంఘం ప్రారంభమైంది. వందలాది కార్మికులు ఈ సంఘం ద్వారా ఉపాధి పొందగా... ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి కూడా పని కల్పించారు. కోటి నుంచి కోటీ 20 లక్షల వార్షిక టర్నోవర్ కలిగిన ఈ సంఘంలో... కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ బకాయిలు అందక... కూలీలకు పని కల్పించేందుకు పెట్టుబడి ఇచ్చే స్తోమత లేక.. చేనేత సంఘం కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల క్రితం 40వేల మగ్గాలుంటే ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 వేలు మాత్రమే ఉన్నాయి. ఉత్పత్తి ప్రణాళిక కింద ఏటా తయారయ్యే వస్త్రాల్ని టెస్కో కొనుగోలు చేస్తుంది. కరోనా కారణంగా వస్త్రాల ఉత్పత్తి నిలిచి ఇక్కట్లు పడుతున్న తరుణంలోనూ... డీసీసీబీకి వడ్డీ చెల్లించాల్సి రావడం వల్ల చేనేత సహకార సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప
ఉమ్మడి జిల్లాలో 45 సంఘాలకుగానూ ప్రస్తుతం 36 మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో అన్ని సొసైటీలకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... 20 శాతం రాయితీ ఇచ్చేవి. ఇప్పుడదీ లేకుండా పోయింది. ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసి రాయితీ కింద వస్తువులు కొని వాటిని విక్రయిస్తేనే.. కార్మికులకు తిరిగి ఉపాధి దొరుకుతుందని చేనేత వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి: అప్పుల్లో తెలంగాణలో ఆరో స్థానం... ఏపీ మూడో స్థానం