శ్రావణ మాసంలో తొలి పండుగ నాగులపంచమి(Nagula panchami) పర్వదినాన నాగదేవతను ఆరాధించడానికి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పుట్టల వద్ద పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజున వెండి, రాగి, రాతి, చెక్కతో చేసిన నాగ పడిగెలను భక్తులు ఆరాధిస్తారు. పాలు, నైవేద్యంతో నాగదేవతను ప్రసన్నం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాలకు పోటెత్తడంతో ఆ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
వరంగల్లో ఆధ్యాత్మిక వాతావరణం
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నాగు పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేయిస్తంభాల ఆలయంలో ఉన్న పుట్ట వద్దకు తెల్లవారుజాము నుంచే మహిళలు క్యూ కట్టారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి నాగులమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. కానుకలు సమర్పించి దీపారాధన చేశారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
యాదాద్రిలో భక్తిభావం
యాదాద్రీశుని దర్శనానికి వెళ్లే ఘాటు రోడ్డు సమీపంలోని పుట్ట వద్ద భక్తులు ఉదయం నుంచి ఆదిశేషునికి భక్తి భావంతో విశేష పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి, నైవేద్యంగా పండ్లు, దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రిలో వెలసిన ఈ నాగదేవత పుట్టలో పాలు పూస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి యేటా నాగులపంచమి రోజు పుట్ట వద్ద పూజలు చేస్తామని భక్తులు తెలిపారు. అనంతరం కొండపైన బాలాలయంలో ప్రతిష్ఠించిన సువర్ణమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తుల రద్దీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాగులపంచమి వేడుకలు భక్తశ్రద్ధలతో జరుపుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో నాగులమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, ఫలహారం సమర్పించి.. కోరిన కోర్కెలు తీర్చాలంటూ వేడుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి, జెండాగల్లీ, ఎల్లమ్మగుడి, బీములయ్య గుడి, పోచమ్మ దేవాలయం, శివారు ప్రాంతాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, ఇతర గ్రామాల్లోని పుట్టల్లో పాలు పోసి మొక్కు చెల్లించుకున్నారు.
జగిత్యాలలో ఘనంగా వేడుకలు
జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల కేంద్రాల్లోని అన్ని గ్రామాల్లో నాగులపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి చీర బొడ్డు బియ్యాన్ని అందించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగదేవత పుట్టల వద్ద ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్, గండి రామన్న, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లోని పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పాలు, మిరియాలు, పూలు, పేలాల తో నాగదేవతను పూజించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నాగుల కట్ట, ఎస్పీహెచ్ కాలనీ, రాంనగర్లలోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: Shravana masam: శ్రావణంలో ఇంటికి కొత్త కళ.. ఇలా.!