పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు కైవసం చేసుకుని ఉత్సాహంతో ఉన్న తెరాస నాగార్జునసాగర్ ఉపఎన్నికపై దృష్టి పెట్టింది. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తెరాస ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జిలుగా నియమించి రంగంలోకి దించింది. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలతో పాటు.. స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణలను విశ్లేషిస్తోంది.
ప్రచారంలో ముందున్న జానారెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ జానారెడ్డి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రధాన పోటీ అని భావిస్తున్న తెరాస... జానారెడ్డిని అన్ని కోణాల్లో ఎదుర్కోవాలని వ్యూహరచన చేస్తోంది. తెరాస నుంచి దాదాపు పది మంది నేతలు టికెట్ రేసులో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు ఇవ్వాలా.. లేక నోముల సామాజికవర్గం యాదవుల్లో ఇతరులకు ఇవ్వాలా.. లేక జానారెడ్డిని సామాజికవర్గం కోణంలో ఎదుర్కొనేందుకు రెడ్డి వర్గం నుంచి ఇవ్వాలా అనే అంశాలను కొన్నాళ్లుగా తెరాస బేరీజు వేస్తోంది.
నోములు కుటుంబ సభ్యులకు లేకుంటే రెడ్డి సామాజిక వర్గానికి
నోముల నర్సింహయ్య కుటుంబం లేదా రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రముఖ నేతను బరిలోకి దించాలని గులాబీ పార్టీ దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య కుటుంబంపై సానుభూతితో పాటు బీసీ, యాదవ సామాజికవర్గాలకు పెద్దపీట వేసిన గుర్తింపు ఉంటుందని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సురభి వాణీదేవికి శాసనమండలి ఛైర్ పర్సన్!
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానంలో అనూహ్యంగా పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని రంగంలోకి దించి విజయం సాధించిన కేసీఆర్.. అదే తరహా వ్యూహరచనలో నిమగ్నమైట్లు కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే ఏడు సార్లు గెలిచి గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయిన జానారెడ్డిని ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతను రంగంలోకి దించాలనే దిశగా కూడా ఆలోచిస్తోంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని రంగంలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది. జూన్లో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనున్నందున.. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కోటి రెడ్డి తదితర నేతలు కూడా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇచ్చి... సురభి వాణీదేవిని శాసనమండలి ఛైర్ పర్సన్ చేస్తే.. ఒకే దెబ్బకు రెండు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనే కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.
వేచిచూసే ధోరణి
అభ్యర్థిని ప్రకటించగానే.. అసంతృప్తి గురైన నేతలకు భాజపా ఆకర్షించవచ్చునని ప్రచారం జరుగుతుండటంతో గులాబీ పార్టీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్నప్పటికీ.. రెండు పార్టీలూ అభ్యర్థిని ప్రకటించడం లేదు. చివరి నిమిషంలో ప్రకటించి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చేసే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రాత్రి లేదా రేపు అభ్యర్థిపై తెరాస తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత