నాగర్జునసాగర్ సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. కొవిడ్ నిబంధనల మేరకు... నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరిగేలా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్ కోసం... అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే వారికి గ్లవ్స్, శానిటైజర్ అందజేయబోతున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు... పోలింగ్ కొనసాగనుంది. 2 లక్షల 20 వేల 3 వందల మంది ఓటర్లున్న నియోజకవర్గంలో... లక్షా 9 వేల 228 మంది పురుషులు, లక్షా 11 వేల 72 మంది మహిళలున్నారు. సెగ్మెంట్ పరిధిలో... అనుముల, పెద్దవూర, గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం, తిరుమలగిరి(సాగర్), మాడుగులపల్లి మండలాలు ఉన్నాయి. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా... తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భాజపా తరఫున రవికుమార్ బరిలో ఉన్నారు.
ఓటరు స్లిప్పులు పంచినా చర్యలే...
పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందజేశారు. రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో పీవోలు, ఏపీవోలకు... అనుముల ఐటీఐ కళాశాల ఆవరణలో వస్తువులు అందించారు. ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 3 వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇందులో సూక్ష్మ పరిశీలకులు 130, వెబ్ కాస్టింగ్ 210, బీఎల్వోలు 293, ఆరోగ్య సిబ్బంది 710 మంది ఉన్నారు. మొత్తంగా 2 వేల 390 మంది పోలీసులతో భద్రత మోహరిస్తున్నారు. స్థానిక పోలీసులు వెయ్యీ 50, ఇతర జిల్లాల నుంచి మరో వెయ్యి మందితోపాటు... 290 మంది గల మూడు కంపెనీల కేంద్ర బలగాలు భద్రతలో పాలుపంచుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల వరకు... ఏ పార్టీ టెంట్లు వేయకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. నిబంధనలు అతిక్రమించి ఓటరు స్లిప్పులు పంచినా... చర్యలు తీసుకుంటారు. ఎవరికైనా ఓటరు పత్రాలు అందకపోతే... ఎన్నికల సిబ్బందిని అడిగి తీసుకోవాల్సి ఉంటుంది.
1,038 బ్యాలెట్ యూనిట్లు, 346 కంట్రోల్ యూనిట్లు, 346 వీవీప్యాట్లను... సిబ్బంది ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు. ఇక 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో... ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.