NagarjunaKonda Tourism : నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నది మధ్యలో ఉండే నాగార్జునకొండకు బోటింగ్ సేవలు నిలిచిపోవడం.. బౌద్ధ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జపాన్, కొరియా, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాల నుంచి ఏటా 15వేల మందికి పైగా పర్యాటకులు నాగార్జునసాగర్‌కు, ఆ పక్కనే ఉన్న నాగార్జునకొండకు వచ్చేవారు. వారిని అక్కడకి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీల్లో తీసుకెళ్లేది. ఇందుకు ఇక్కడి పర్యాటక ఏజెంట్లు ఆయా దేశాల ఏజెంట్లతో కలిసి ప్యాకేజీల్ని నిర్వహిస్తుంటారు. నాగార్జునకొండకు రెండు పెద్ద, ఒక చిన్న లాంచీలు నడిపేవారు. సాగర్ నుంచి లాంచీలు నడపడం ద్వారా వచ్చే ఆదాయంలో ఏపీ అటవీశాఖ వాటా కోరేది. గతంలో పెద్దల టికెట్ రూ.150లో రూ.50 చొప్పున, పిల్లల టికెట్ రూ.120లో రూ.20 చొప్పున తీసుకునేది. ఆ తర్వాత టికెట్ల ఆదాయంలో తమకు 40 శాతం ఇవ్వాలని ఏపీ అటవీశాఖ డిమాండ్ చేసింది. అయితే 20 శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి ఏపీ ఒప్పుకోకపోవడంతో 2019 సెప్టెంబరు నుంచి లాంచీలు నడవడం లేదు. ఈ నేపథ్యంలో ముందస్తుగా బుక్ చేసుకున్న యాత్రలను విదేశీ పర్యాటకులు రద్దు చేసుకున్నారు. కొత్తవారూ ఆసక్తి చూపట్లేదు. దీని కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి రాష్ట్రానికి చెందిన పర్యాటక ఏజెంట్లు తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితం దిల్లీ ఏఎస్‌ఐ అధికారులు నాగార్జునకొండను సందర్శించారు. సమస్యను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు చెప్పగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
బుద్ధుడి దంత ధాతువు.. శిలాశాసనాలు
NagarjunaKonda Buddhist Tourism : నాగార్జునసాగర్‌కు 14 కి.మీ. దూరంలో నాగార్జునకొండపై మ్యూజియం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ‘సాగర్’ నిర్మాణ సమయంలో బయల్పడిన 2వ శతాబ్దం నాటి బౌద్ధ చారిత్రక సంపదను జలాశయం మధ్యలో కొండపై కట్టిన ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఇందులో బౌద్ధ చరిత్రను తెలిపే శిలాశాసనాలు, స్తూపాలున్నాయి. బుద్ధునిదిగా చరిత్రకారులు చెబుతున్న దంత ధాతువు ప్రత్యేకమైనది. ఈ ప్రదేశానికి బౌద్ధం విస్తరించిన దేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అతిపెద్ద ద్వీపపు మ్యూజియంగా ఇది పేరొందింది.
పర్యాటకులు లేక నష్టం
NagarjunaHill Tourism : '1988 నుంచి విదేశీ బౌద్ధ పర్యాటకుల్ని తీసుకువస్తున్నాం. 2019లో జరిగిన పాపికొండలు బోట్ ప్రమాదంతో ఏపీలోని జలాశయాల్లో బోటింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత భద్రతపరమైన చర్యలు తీసుకుని తిరిగి అనుమతించారు. నాగార్జునకొండకు తెలంగాణ నుంచి లాంచీలు నడవకపోవడంతో విదేశీ పర్యాటకులు రావడం లేదు. బౌద్ధ పర్యాటకంపై ఆధారపడ్డ టూరిజం ఆపరేటర్లు నష్టపోతున్నారు.'
- కె.రంగారెడ్డి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్
ఇదీ చదవండి: Covid 19 R Value : ఆర్ వాల్యూ పైపైకి.. పెరుగుతున్న కరోనా వ్యాప్తి