సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాల కారణంగా... ఆయకట్టు తడవకముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకలేకపోవడం వంటివి జరుగుతున్నాయి. గుత్తేదార్లు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam) గేట్లు తెరుచుకోగా, పక్షం రోజుల పాటు నిరంతరాయంగా సుమారు 91 టీఎంసీల నీటిని వదిలిపెట్టారు. ఈ క్రమంలో ప్రాజెక్టు ఎడమవైపున 8 గేట్ల దిగువ భాగంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. నీటి ప్రవాహానికి పైన ఉన్న సున్నం కొట్టుకుపోయి కంకర తేలింది. వీలైనంత తొందరలో వీటికి మరమ్మతులు చేయాలని, లేదంటే ప్రాజెక్టు భద్రతపై ఇది ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలువకు మరమ్మతేదీ
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar Dam) ఎడమ కాలువ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 150 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. దీనికి అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. కొనిచోట్ల లైనింగ్‌పై చెట్లు పెరిగి రంధ్రాలు పడ్డాయి. భారీవర్షాలతో కాలువగట్లకు అక్కడక్కడ పగుళ్లు ఏర్పడి కుంగిపోయాయి. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా పంటలకు నీరు విడుదల చేశారు. పంట పూర్తయ్యే వరకు నీరు ఇస్తారు. కాలువ నిర్వహణకు ప్రభుత్వం నెల క్రితం రూ.15 కోట్లు కేటాయించింది. మొదటి విడత నీటి విడుదల ఆగాక అత్యవసర పనులైనా చేపట్టలేదు. ఈ కాలువకు రూ.వందల కోట్ల వెచ్చించి ఏటా మరమ్మతులు చేస్తున్నా పరిస్థితులు మెరుగుపడటం లేదు. గతేడాది ఆగస్టులో హాలియా 21వ కి.మీ. మైలురాయి వద్ద తెగిన కట్టకు ఇసుక బస్తాలతో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ఏడాది దాటినా దానివైపు తిరిగి చూస్తే ఒట్టు!
ఇదీ చూడండి: ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ.. ప్రశ్నార్థకంగా జలాశయాల భవిష్యత్తు
Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లకు మరమ్మతులు