పేదింటి ఆడపడుచుల వివాహ కానుకగా ప్రభుత్వం ఇస్తోన్న కల్యాణలక్ష్మి సొమ్మును మహిళా సంఘం అప్పు కింద జమ కట్టారు బ్యాంకు అధికారులు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో వెలుగుచూసింది. మునుగోడుకు చెందిన బొడ్డు కమలమ్మ గతేడాది తన పెద్ద కుమార్తె వివాహం చేశింది. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేయగా ఇటీవలే మంజూరైంది. జూన్ 16న స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత చెక్కును కమలమ్మకు అందజేశారు. ఆ చెక్కును మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉన్న తన ఖాతాలో జమచేసుకుంది.
డ్రా చేసేందుకు వెళ్తే...
పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు అకౌంట్లో జమచేసిన కల్యాణలక్ష్మి డబ్బులు డ్రా చేద్దామని నాలుగురోజుల క్రితం బ్యాంకుకు వెళ్లగా.. అధికారులు ఇచ్చిన సమాధానంతో నివ్వెరపోవటం కమలమ్మ వంతైంది. డబ్బులు తీసుకునేందుకు అధికారులకు అర్జీ పెట్టుకోగా.. ఆ డబ్బు హోల్ట్లోకి వెళ్లిందని సమాధానమిచ్చారు. అలా ఎందుకవుతుందని కమలమ్మ ప్రశ్నించగా... ‘మీరు సభ్యురాలిగా ఉన్న మహిళా సంఘం అప్పు కట్టలేదు. అందువల్ల మీ ఖాతాలో ఉన్న నగదు హోల్డ్‌లోకి వెళ్లింది. ఆ డబ్బులు కట్టిస్తే.. మీ నగదు మీకు ఇస్తాం’ అని అధికారులు బదులిచ్చారు. సంఘం అప్పు ఉంటే తాను ఎలా బాధ్యురాలిని అవుతానని కమలమ్మ ప్రశ్నించింది. తన డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడింది. అయినా బ్యాంకు వాళ్లు కనికరించలేదు.
ఎవరి అకౌంట్లో ఉన్నా అంతే..!
" చెక్కు వేసేటప్పుడు వేసుకోలేదు. కాళ్లావేళ్లా పడితే వేసుకున్నారు. ఇప్పడేమో అప్పులు కట్టుకుంటామని డబ్బులు తీసుకుంటామంటే ఇస్తలేరు. పెళ్లికి చేసిన అప్పులను కల్యాణలక్ష్మి డబ్బుతో తీర్చుదామని ఏడాది నుంచి అందరికి సర్దిచెప్పుకుంటా వస్తున్నాం. ఇప్పుడేమో బ్యాంకోళ్లు ఇట్లా చేస్తున్నరు. ఉపాధిహామీ పనికి వెళ్లిన డబ్బులు కూడా అదే అకౌంట్లో పడ్డాయి. అవ్వి కూడా ఇవ్వట్లేదు. నాలుగురోజులుగా అధికారుల బ్యాంకు చుట్టూ తిరిగినా.. కనికరం చూపట్లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరిస్తున్నారు."- కమలమ్మ, బాధిత మహిళ
సదరు బ్యాంకుకు చెందిన ఓ అధికారిని వివరణ కోరగా... ఆధార్ అనుసంధానం ఉన్నందు వల్ల సంఘంలోని సభ్యుల్లో ఎవరి ఖాతాలో డబ్బులు ఉన్నా హోల్డ్‌లోకి వెళ్తాయని సమాధానం ఇచ్చారు.