రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, మైనింగ్స్, వైన్స్ కబ్జా తప్ప తెరాస చేసిందేమీ లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Mp Uttam Comments) ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు రాబందుల్లా జనం మీద పడి ప్రజల రక్తం పిలుస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Mp Uttam Comments) పాల్గొన్నారు.
హుజూర్నగర్ కాంగ్రెస్ (Huzurnagar) కంచుకోటగా పేర్కొన్న ఉత్తమ్... ప్రస్తుతం నియోజకవర్గానికి ఓ దొంగల ముఠా వచ్చిందని దుయ్యబట్టారు. మఠంపల్లిలో అటవీ భూములు, చింతలపాలెం మండలంలో వందల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు.
హుజూర్‌నగర్‌లో డిగ్రీ కళాశాల, వంద పడకల హాస్పిటల్‌ను లిఫ్ట్‌లను ఏర్పాటు చేసింది తానేనని చెప్పారు. మోదీ, కేసీఆర్ కలసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ రూ. 15 లక్షలు మీ ఖాతాలో వేశారా అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ విపరీతంగా ధరలు పెరిగాయన్నారు. కేసీఆర్ కుటుంబంలో కొలువులు ఉన్నాయి కానీ నిరుద్యోగులకు కొలువులు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఊసు లేదన్నారు.
హుజూర్నగర్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. కొంచెం బ్యాక్ స్టెప్ వేసినా... మళ్లీ మనమందరం ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నాం. మనమంతా కుటుంబ సభ్యులుగా ముందుకుపోదాం. ఎవరికీ భయపడొద్దు. అధికార పార్టీ నాయకులకు అస్సలు భయపడొద్దు. నా సుధీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నా... ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ప్రజలు నిబద్ధత, నిజాయతీని మాత్రమే గుర్తిస్తరు. నియోజకవర్గాన్ని లూటీ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు ఈసారి ఓటుకు రెండు వేలు ఇస్తారంటా... రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా... ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
-- ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ