MLC Elections Counting: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. శాసనమండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీ ఎవరో తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 12 స్థానాలకు గానూ ఇప్పటికే ఆరుస్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన ఆరుస్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. ప్రజాప్రతినిధులు వినియోగించుకున్న ఓటుహక్కు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమవ్వగా.. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. తొలిరౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యం రాకపోతేనే.. రెండో రౌండ్ లెక్కింపు చేపడతారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ రెండు డోసులు వేసుకున్న వారినే పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు.
ఖమ్మంలో..
MLC Elections Counting in Khammam: ఖమ్మంలో మొత్తం 738 మంది ప్రజాప్రతినిధులు వినియోగించుకున్న బ్యాలెట్ పత్రాలు బాక్సుల్లో నిక్షిప్తమవ్వగా.. లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ..తెరాస- కాంగ్రెస్‌లు ఎవరికివారే గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. అత్యధిక ప్రజాప్రతినిధుల బలం ఉన్నందున తమ గెలుపు నల్లేరుపై నడకే అని తెరాస ధీమాతో ఉంది. ఇక క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ పార్టీ కొండంత ఆశలు పెట్టుకుంది. ఇలా ఉత్కంఠ రేపుతున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై రేపటి వరకు వేచి చూడాల్సిందే.
నల్గొండలో..
MLC Elections Counting in Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని వెల్లడించారు. లెక్కింపు కేంద్రంలో కూడా కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు కోసం నాలుగు టేబుళ్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తి అయే అవకాశం ఉందని.. ఓట్ల లెక్కింపులో సుమారు 200 మంది సిబ్బంది పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
మెదక్‌లో..
MLC Elections Counting in Medak: మెదక్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ చెప్పారు. ఓట్ల లెక్కింపుకు నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది ఉంటారన్నారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకోవచ్చని, వారంతా మంగళవారం ఉదయం 7.30గంటల వరకల్లా రావాల్సి ఉంటుందని, వారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్తామని అన్నారు. ప్రధానంగా చెల్లుబాటు కానీ ఓట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అంకెల రూపంలో రాసిన ఓట్లే చెల్లు బాటు అవుతాయని ఆయన తెలిపారు. మొదటి ప్రాధాన్యత రాయకుండా 2, 3 ప్రాధాన్యతలు రాసినా, అక్షరాలలో రాసినా లేదా క్రాస్ మార్కు, రైట్ టిక్కు మార్కు పెట్టినా చెల్లుబాటు కావని జిల్లా ఎన్నికల అధికారి హరీష్ స్పష్టం చేశారు.
ఆ జిల్లాల్లో ఫలితాలపై ఉత్కంఠ
రసవత్తరంగా సాగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆసక్తికర పరిణామాల మధ్య పోలింగ్ ముగియగా.. ఎవరు గెలవనున్నారో రేపు తేలనుంది.
ఇదీ చదవండి:
karimnagar mlc elections 2021: కరీంనగర్లో ఎమ్మెల్సీ ఫలితాలు మారనున్నాయా..?