మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వివాదం రగులుతోంది. మొన్నటి ఘటన మర్చిపోకముందే.. తాజాగా మునుగోడులోనూ దళితబంధు అమలు చేయాలని.. 2 వేల మందితో నిరసన కార్యక్రమానికి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ఇవాళ మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు.. రాజగోపాల్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర‌్తలను అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు కోసం నిరసన కార్యక్రమానికి.. మునుగోడుకు వెళ్తుండగా.. రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత.. బొంగులూరు గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
మొన్న చౌటుప్పల్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో.. మంత్రి ప్రసంగాన్ని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రగడ మొదలైంది. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
తనను అరెస్ట్ చేయడంతోపాటు..కాంగ్రెస్ కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించడానికే.. దళితబంధు పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని.. డిమాండ్ చేశారు.
''నన్ను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గృహనిర్బంధం చేయడాన్ని ఖండిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళితబంధ పథకాన్ని పెట్టాలి. అట్ల అయితేనే తెరాస ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగనిస్తాం. దళితులందరూ ఏకం కావాలి. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే ఈ పథకం. మునుగోడులో 2వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా... ఇదంతా ప్రభుత్వం కుట్ర.. ఈటల రాజేందర్‌ను ఓడించాలనే హుజూరాబాద్‌లో ఈ పథకం తీసుకువచ్చారు. ''
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే
అరెస్టులను ఖండించిన సీఎల్పీనేత
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. చౌటుప్పల్‌లో ప్రభుత్వ కార్యక్రమమైన రేషన్‌కార్డుల పంపిణీలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నట్లుగానే రూ.2వేల కోట్లతో దళిత బంధు పథకం నిధులను మునుగోడు నియోజకవర్గానికి కూడా కేటాయించాలని... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రాజగోపాల్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే దమననీతిని మానుకోవాలని హెచ్చరించారు. లేనట్లయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొక తప్పదన్నారు.
ఇదీ జరిగింది...
లక్కారంలో నిర్వహించిన కొత్త రేషన్ కార్టుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత పాలకులు వైఫల్యాలను ప్రస్తావిస్తూనే తెరాస చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు అంటూ ఎమ్మెల్యే అడ్డుకునే క్రమంలో ఇరువురు నేతల మాటామాటా పెరిగింది. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని నిరసన తెలిపిన రాజగోపాల్ రెడ్డి... ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. కాంగ్రెస్, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోగా పోలీసులు వారిని వారించారు.
రాజగోపాల్‌రెడ్డి వాదనిది..
ప్రతిపక్ష శాసనసభ్యుడు కావడం వల్లే చిన్నచూపు చూస్తూ కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని... మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... కార్యకర్తలతో కలిసి హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా అభివృద్ధిని ఏనాడు కాంక్షించని మంత్రి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తిప్పికొట్టిన మంత్రి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలను మంత్రి జగదీశ్ రెడ్డి తిప్పికొట్టారు. ప్రతిపక్ష సభ్యులు ఉనికి కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారంటూ మంత్రి చురకలు అంటించారు.
ఈరోజు 2 వేలమందితో నిరసనకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు. దీనితో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా... గొడవలు జరిగే అవకాశం ఉందన్న నెపంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం