నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో 50 కిలోమీటర్ల మేర ఎన్ఎస్పీ కాలువ ప్రవహిస్తుంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సాగర్ ఎడమ కాలువలో పడి సుమారు 12 మంది చనిపోయారు. నిడమనూరు పీఎస్ పరిధిలో ముగ్గురు, త్రిపురారం పీఎస్ పరిధిలో ముగ్గురు, హాలియా పీఎస్ పరిధిలో ఐదుగురు, వేములపల్లి పీఎస్ పరిధిలో ఐదు మంది ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో పడి చనిపోయారు.
రహదారి గుండా ప్రవహిస్తున్నందువల్లే !
కాలువలోకి దిగి స్నానాలు చేయడం, ఈత కొట్టడం, మద్యం మత్తులో కాలువలోకి దిగడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేములపల్లి వద్ద అద్దంకి, నార్కట్ పల్లి రహదారి గుండా సాగర్ ఎడమ కాల్వ ప్రవహిస్తుండటం వల్ల ప్రయాణికులు, లారీ డ్రైవర్లు స్నానాలు చేస్తూ అజాగ్రత్తగా ఉంటున్నారు. ఈ క్రమంలో నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు. మరికొంత మందికి ఎడమ కాల్వ ఆత్మహత్యలకు అవకాశంగా మారింది. ఎడమ కాలువ వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినా నామమాత్రంగానే మిగిలాయి.
ఇకపై కాలువ కట్టలపై పెట్రోలింగ్ చేస్తాం..
ఇక నుంచి ఎవరైనా కాలువ కట్టలపై మద్యం సేవించడం, ఈత కొట్టడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. స్నేహితులతో కలిసి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నీటిలోకి ఈత కొట్టేందుకు దుంకడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పిల్లలు కాలువల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇకపై టూవీలర్ పెట్రోలింగ్, ఫోర్ వీలర్ పెట్రోలింగ్ చేపడతామని వెల్లడించారు.
అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100 !
ఎవరైనా కాలువ కట్టలపై అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ పేరు చెప్పాలని పోలీసులన్నారు. ఈత సరదా తల్లిదండ్రుల గర్భశోకానికి కారణం కాకూడదని హితవు పలికారు. ఇందుకు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు.