మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న యువతిపై 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి మంత్రి కేటీఆర్(KTR RESPOND) స్పందించారు. ఆమెకు వీలైనంత త్వరగా సహకరిస్తామని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన దోనాల గాయత్రి(21).. ఎనిమిదేళ్లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. 'ఈనాడు'లో ఈ నెల 23న 'మాత్రలు వేసుకుంటేనే మనుగడ' శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని బండారు తేజ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. విషయాన్ని పరిశీలించి ఆమెకు తగిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన కేటీఆర్(KTR RESPOND) 'మేము వీలైనంత త్వరగా సహకరిస్తాం బ్రదర్..' అని రీ ట్వీట్ చేశారు. బాధితురాలి తండ్రితో కేటీఆర్ కార్యాలయ సిబ్బంది ఆదివారం చరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వపరంగా సాయం అందితే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది.
రెక్కాడితే గానీ డొక్కాడదు
చండూరుకు చెందిన గాయత్రి తండ్రి భూపాల్ రెడ్డి పాల వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గాయత్రి చిన్న కుమార్తె కావడంతో చిన్నతనం నుంచీ అల్లారుముద్దుగా చూసుకున్నారు. యుక్త వయసులోకి రాగానే ఆ కుటుంబాన్ని కిడ్నీల వ్యాధి రూపంలో కష్టాలు కబళించి వారి ముఖాల్లోని ఆనందం దూరం చేసింది. గాయత్రి రెండు మూత్రపిండాలు పాడైపోవడంతో.. నిత్యం రూ.వందలు విలువ చేసే మాత్రలు మింగితే గాని ఆమె సాధారణ స్థితిలో ఉండేది కాదు. ఎనిమిదేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూనే ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పటంతో అందుకు ఆర్థిక స్తోమత సరిపోక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఔషధాల ద్వారానే ఆమె బతికించుకుంటూ వస్తున్నారు.
ఒక్కరోజు మాత్రలు వేసుకోకపోయినా
ప్రస్తుతం నెలకు రూ.15 వేలు విలువ చేసే మందులు వేసుకుంటూ గాయత్రి జీవన్మరణ పోరాటం చేస్తోంది. కూతురు చికిత్స కోసం ఇప్పటికే ఉన్న మూడెకరాల పొలం అమ్ముకున్నామని.. ప్రస్తుతం ఇల్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టామని ఆమె తండ్రి వాపోయారు. అయినా కూతురును ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చికిత్స నిమిత్తం తిరగని ఊరు లేదు, వెళ్లని ఆస్పత్రి లేదని పేర్కొన్నారు. ఒక్కరోజు మందులు ఆపినా కూతురు ముఖం మొత్తం వాపు వచ్చి కంటి చూపు చూడలేని స్థితిలోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, నిత్యం ఔషధాలకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదని చెప్పారు. దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. దాతలెవరైనా సాయం చేయాలనుకుంటే ఈనాడు - హెల్ప్‌లైన్ నంబర్ 96764 88878కి సంప్రదించవచ్చు.
ఇదీ చదవండి: ktr about dairy development: 'పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.'