రాష్ట్రంలో నిర్మించనున్న రైతు వేదికలు భారత దేశంలోనే విప్లవాత్మక మార్పునకు నాంది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, చండూర్ (బంగారు గడ్డ), మునుగోడులో చేపట్టనున్న రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రైతు వేదిక భవనాలు దసరా నాటికి అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగం నిర్వీర్యం అయిందని... తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై దృష్టి సారించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేయడానికి... రైతాంగం సంక్షేమానికి సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, రైతు బంధు జిల్లా కో ఆర్డినేటర్ రాంచంద్ర నాయక్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.