పల్లె ప్రగతి, హరితహారంలో కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. దామరచర్ల, మిర్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం దామరచర్ల మండలంలోని నూనావత్ తండాలో హరితహారంలో భాగంగా నాలుగు ఎకరాల్లో గ్రామస్థులచే 2వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పనులు పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి... వర్మి కంపోస్టు తయారు చేసి గ్రామాలు ఆదాయాన్ని పొందుతున్నాయని మంత్రి తెలిపారు. ఊట్లపల్లి గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన అనంతరం మంత్రి స్థానిక రైతులతో ముచ్చటించారు.
రైతు వేదికలు.. మార్గదర్శక వేదికలు
రైతు వేదికలు వ్యవసాయదారులకు మార్గదర్శక వేదికలు అవుతాయని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రైతులు తాము పండించిన పంటల దిగుబడులు... క్లస్టర్ వారీగా పండించే పంటల వివరాలు తెలుసుకునే వేదికలుగా ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయని స్థానికులకు వివరించారు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువుల యాజమాన్య పద్ధతులను తెలుసుకునే వీలుగా రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి వారికి కావలసిన సమాచారాన్ని అందజేస్తారని అన్నారు. ప్రతి రైతు ఎకరం పొలంలో లక్ష రూపాయల ఆదాయం పొందే ఈ విధంగా వ్యవసాయం చేయాలని ఆ దిశగా పంటలు వేయాలని, రైతుల సమస్యలు తీర్చే విధంగా రైతువేదికలు ఉపయోగపడాలని అన్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వరిని పండించాలని అధిక ఆదాయం వచ్చే కూరగాయ పంటలను, పండ్ల తోటలను పెంచాలని రైతులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపురేఖలే మారిపోయాయని... వీటన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి..
అడవులను నరికివేసి మొక్కలను పెంచే ప్రయత్నం చేయకపోవడం వల్ల మానవుడు వాతావరణంలో పెను మార్పులకు కారణం అయ్యాడని మంత్రి వెల్లడించారు. మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుందని అన్నారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరికి వేయడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చెట్ల ఆవశ్యకతను గుర్తించిన కొన్ని దేశాలు కఠినమైన నిర్ణయాలు తీసుకువచ్చాయని ... మానవ మనుగడకు అవసరమైన చెట్లను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పెంచాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకొని ఊరు వాడలా చెట్లను నాటించారని తెలిపారు. పల్లెలు పట్టణాల్లో ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా..
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన విధంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, రైతువేదికలు., సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి నిజం. గ్రామాల్లో పరిశుభ్రత విషయంలో కూడా అవగాహన వచ్చింది. అన్నింటికి మించి పర్యావరణానికి ఉపయోగపడే విధంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. -జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: KISHAN REDDY : సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి