Online Betting spoils youth : కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం... ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారస పడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి.
నేటి ఆధునిక కాలంలో యువత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగుల్లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 18-40 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉంటున్నారు. స్నేహితుల మూలంగా, చరవాణి సహకారంతో చిన్నగా, సరదాగా ప్రారంభమైన ఈ మహమ్మారి ఇల్లు, గుల్ల చేసేవరకు వదలడం లేదు. తేరుకునే సరికి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఫలితంగా వీరిని నమ్ముకున్న కుటుంబీకులు దుఃఖ పీడితులు అవుతున్నారు.
ఇటీవల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో మురళీ అనే యువకుడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాట మూలంగా ఆర్థికంగా నష్టపోయాడు. అతని తండ్రి ఎకరం వ్యవసాయ భూమిని విక్రయించి, అతను చేసిన అప్పులను తీర్చాడు. అయినా అతనిలో మార్పురాకపోగా మరోసారి బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.
ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి :
- మంచి అలవాట్లు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. ఆలస్యం అయినా సత్ఫలితాలు సాధ్యమవుతాయని విశ్వసించాలి.
- సులభ ఆదాయమార్గం వైపు మొగ్గుచూపకుండా తమకు తామే నియంత్రించుకోవాలి. బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా ప్రమాదకరంగా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లకు అలవాటుపడటం గుర్తిస్తే పెద్దలకు సమాచారం అందించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
- బెట్టింగులను ప్రోత్సహించినట్లు ఎవరైనా మాట్లాడినా, చరవాణిలలో సంక్షిప్త సమాచారం, కాల్స్ వచ్చినా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.
'‘సులభ’ మార్గం సరైంది కాదు : సులభంగా వచ్చేది ఏదీ సరైన మార్గం కాదు. ఒకవేళ సులభంగా ఏదైనా దక్కినా.. అది చేజారిపోతుందని గుర్తించాలి. చెడు వ్యసనాలు కష్ట, నష్టాలకు ప్రధాన కారణాలు. సులభమార్గంలో పైకి ఎదగాలనే ఆలోచన ఉన్నవారు తర్వాత ఎదురయ్యే పరిస్థితుల్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు సమాజంలో తలెత్తుకోలేరు అనేది గుర్తుచేసుకోవాలి. కష్టపడి సంపాదించడంలోనే ఆనందం, తృప్తి ఉంటుంది.'-ఆర్.జయసింహ, మానసిక వికాస నిపుణులు
ఇవీ చదవండి :