UGC Chairman: విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య మామిడాల జగదీశ్ కుమార్‌ను కొత్త యూజీసీ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం దిల్లీ జేఎన్‌యూ వీసీగా ఉన్న ఆయనను ఈ ఉన్నత పదవికి ఎంపిక చేసింది. యూజీసీ ఛైర్మన్‌గా జగదీశ్ కుమార్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీశ్ కుమార్ ఐఐటీ దిల్లీలో ఎలక్ట్రికల్ ఆచార్యుడు. 2016 జనవరి నుంచి జేఎన్‌యూ వీసీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈనెల 26తో ముగుస్తుంది. ఇటీవల యూజీసీ ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ జారీ కాగా మొత్తం 55 మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. అందులో కమిటీ ప్రాథమికంగా ఏడుగురిని ఎంపిక చేసింది. వారిలో జగదీశ్‌కుమార్‌తో పాటు ఇఫ్లూ ఉపకులపతి ఆచార్య ఇ.సురేష్‌కుమార్ కూడా ఉన్నారు. వీరంతా ఈనెల 3న దిల్లీలో కమిటీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కమిటీ అందులో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా.. ఈ పదవికి జగదీశ్ కుమార్‌ను కేంద్రం ఎంపిక చేసింది. దీంతో జగదీశ్ కుమార్.. యూజీసీ ఛైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తిగా నిలవడం విశేషం. గతంలో తెలుగువారైన వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961లో, జి.రామిరెడ్డి 1991-95 వరకు యూజీసీ ఛైర్మన్లుగా పనిచేశారు.
ఇదీ చదవండి: