Lemon Prices: మండుతున్న ఎండల్లో కాసింత నిమ్మరసం తాగి సేద తీరాలనుకోవడమూ ఖరీదైన వ్యవహారంగా మారింది. రాష్ట్రంలో నిమ్మకాయలకు తీవ్ర కొరత ఏర్పడటమే ఇందుకు కారణం. గతేడాది కన్నా పంట దిగుబడి సగానికి పైగా తగ్గిపోగా.. ధర మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం టోకు మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయంలో రూ.3 వేలలోపే ఉండేది. చిల్లర మార్కెట్లో కిలో రూ.140 నుంచి రూ.160లకు అమ్ముతున్నారు. విడిగా అయితే రూ.10కి 2 కాయలకు మించి ఇవ్వడం లేదు. దీంతో వినియోగదారులు కొనలేకపోతుండగా.. తమకూ ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట.. రాష్ట్రంలో నిమ్మకాయల సాధారణ సాగు విస్తీర్ణం 45 వేల ఎకరాలు కాగా.. ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. గత అక్టోబరు నుంచి జనవరి వరకూ కురిసిన అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో పాటు తెగుళ్లు, అధిక తేమతో పూత, కాత సరిగా రాలేదు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే సాగవుతుంది. తామర పురుగు, ఇతర తెగుళ్లతో ఈ రెండు జిల్లాల్లో నిమ్మ చెట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని నల్గొండ జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మకాయల మార్కెట్‌కు గతేడాది(2021) ఏప్రిల్‌లో రోజూ 7 నుంచి 8 వేల బస్తాల దాకా రాగా.. ప్రస్తుతం 1500-2500 బస్తాలే వస్తున్నాయి.
బస్తా(23 కిలోలు) ధర గతేడాది ఇదే సమయంలో రూ.ఆరేడు వందలుండగా ప్రస్తుతం ఒక్కోరోజు గరిష్ఠంగా రూ.2,500 నుంచి 3 వేల దాకా పలుకుతోంది. నిమ్మ పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడం పెద్ద సమస్యగా మారిందని, మద్దతు ధర ప్రకటిస్తే రైతులు మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారని ఉద్యానవనశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు.
ధర బాగున్నా.. గతంలో ఎన్నడూ లేనంతగా నిమ్మకాయలకు మంచి ధర వస్తున్నా దిగుబడి లేక నష్టపోతున్నా. నాకు రెండు ఎకరాల్లో నిమ్మతోట ఉంది. అధిక వర్షాలు, మంచు కారణంగా పూత, పిందె దశలో తోటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు ఎర్రనల్లి ఉద్ధృతితో దిగుబడులు తగ్గాయి. గత సంవత్సరం మార్చి వరకు 350 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మార్చి వరకు 100 బస్తాలూ రాలేదు. -బెల్లి వెంకన్న, నల్గొండ జిల్లా పాలెం గ్రామం
ఇదీ చదవండి: TRS protests: ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు.: కేంద్రంతో పోరులో తెరాస నేతలు