CM KCR Hujurnagar Public Meeting : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(CM KCR) సుడిగాలి ప్రచారం చేశారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభల్లో పాల్గొన్న గులాబీ దళపతి.. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతుబంధు దుబారా ఖర్చు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని.. అలాంటి వ్యక్తిని కాకుండా అన్నదాతలకు అండగా నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరారు.
KCR fires on Congress : పదవులు, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమ సమయంలో నోరు మెదపలేదని మిర్యాలగూడ సభలో కేసీఆర్ విమర్శించారు. ప్రజల బాధలు ఆ పార్టీ నేతలకు పట్టవని ఆరోపించారు. పదేళ్లుగా ఎలాంటి ఘర్షణలు లేకుండా పాలన సాగిందని.. కాంగ్రెస్ దుర్మార్గులు బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై దాడి తెగబడ్డారని మండిపడ్డారు. అలాంటి పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రానికి కష్టాలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.
KCR Election Campaign 2023 : పంజాబ్ తర్వాత వ్యవసాయంలో రెండో స్థానంలో ఉన్నామని.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ అంటోందని.. ఏసీలో ఉండి సాగు తెలియని వ్యక్తి కూడా విద్యుత్ వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ధరణి తొలగించాలని చెబుతున్నారని.. అసలు ధరణి గురించి రాహుల్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే రైతు బంధు, రైతు బీమా, ధాన్యం డబ్బులు ఖాతాల్లో ఎలా జమవుతాయన్నారు.
రైతు బొటనవేలు పెడితే తప్ప సీఎం కూడా భూమిని మార్చలేరని.. ప్రజలకు ఇచ్చిన ఈ అధికారాన్ని వదులుకుంటారో.. కాపాడుకుంటారో ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు స్టేలు తెచ్చి ప్రాజెక్టుల్ని అడ్డుకున్నారని.. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రెండున్న ఏళ్లలో దిండి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఓటు వేసే ముందు అన్ని విధాలా ఆలోచించాలని.. ప్రజా సంక్షేమ కోసం పని చేసే బీఆర్ఎస్ను దీవించాలని కేసీఆర్ కోరారు.
"రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజాసంక్షేమం పట్టదు. అభివృద్ధిని పాతరేసి, అవినీతికి, అక్రమాలకు పాల్పడే వారికి పట్టం కడితే.. రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుంది. రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలను కాంగ్రెస్ కాలరాయాలని చూస్తోంది. రైతుబంధు దుబారా ఖర్చు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. అలాంటి పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రానికి కష్టాలు తప్పవు". - కేసీఆర్, సీఎం