నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చాలావరకు నగల తయారీ దుకాణాలు ఉన్నాయి. వాటిలో చాలా మంది స్వర్ణకారులు ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మే నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో... బంగారు ఆభరణాల కోసం ఆర్డర్ రావడం ఒక ఎత్తయితే... రోజులో పని చేసేందుకు నాలుగు గంటలే సమయం ఉండడం మరో ఎత్తు. బతుకుదెరువు కోసం ఆర్డర్లు వద్దనలేక... కొనుగోలుదారులకు ఒప్పుకున్న సమయానికి నగలు చేసి ఇవ్వలేక సతమతమవుతున్నారు.
గత ఏడాది కూడా...
కిందటి సంవత్సరం కూడా తీరా పెళ్లిళ్ల సీజన్లోనే లాక్డౌన్ విధించడంతో చాలా నష్టపోయామని... స్వర్ణకారులు వాపోయారు. ఈ ఏడాదైనా పనులు చేసుకుంటే బతుకు సాఫీగా సాగుతుందనుకునే తరుణంలో... లాక్ డౌన్ వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు వచ్చి దుకాణంలో అన్నీ సర్దుకునే లోపే రెండు గంటల సమయం పడుతోందని అన్నారు. మిగిలిన రెండు గంటల్లో ఏ పని సరిగ్గా చేయలేక... వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం సత్వరమే ఆలోచించి పేద స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు.
ఆర్థికంగా నష్టపోయాం...
గత సంవత్సరం విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దాని నుంచి బయటపడతాం అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో... నగలు కొనేవారు కరువయ్యారు. కొనడానికి వచ్చినవారికి కూడా సమయం లేక చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే స్వర్ణకారులను ఆదుకోవాలి.
-----ఆనందాచారి, మిర్యాలగూడ పట్టణం
రెండు గంటలు పెంచితే మేలు...
కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 4 గంటల సడలింపు సమయంలో ఏ పనీ సరిగ్గా చేయలేక... కొనుగోలుదారులకు న్యాయం చేయలేకపోతున్నాం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పనులు చేసేందుకు... లాక్ డౌన్ సడలింపును ఇంకో రెండు గంటలు పెంచితే మాకు మేలు జరిగేది. ప్రభుత్వ నిర్ణయంతో ఎవరికీ ఉపయోగం లేదు. సడలింపు సమయం విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుంటుంది.
----- నగల దుకాణ యజమాని, మిర్యాలగూడ పట్టణం
ఏపీలో మాదిరిగా...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం... ప్రభుత్వం కూడా 40 మందితో వివాహాలు చేసుకునేందుకు అనుమతివ్వడంతో... నగల కోసం చాలామంది వస్తున్నారు. సమయం తక్కువగా ఉండడం వల్ల పనులు హడావిడిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి చెప్పిన సమయానికి ఆభరణాలను అందించలేకపోతున్నాం. ఏపీలో మాదిరిగా 12 గంటల వరకు నిబంధనలు సడలిస్తే బాగుంటుంది.
---------స్వర్ణకారుడు, మిర్యాలగూడ పట్టణం
ఇదీ చదవండి: ఆపత్కాలంలో సర్పంచ్ భర్త మానవత్వం.. తండ్రికి కూతురే తలకొరివి!