Jadala ramalingeswara swamy Kalyanam : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేకువజామునే వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు.
వైభవంగా కల్యాణం
జడల రామలింగేశ్వరుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా మంగళవారం రోజు ప్రారంభమైన ఉత్సవాలు... ఈనెల 13 వరకు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బుధవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ ఛైర్మన్ అరుణ రాజి రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు.
సందడిగా ఆలయ పరిసరాలు
స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. భక్తుల కొంగుబంగారమైన స్వామి వారి కల్యాణాన్ని తిలకించి... వారు తెచ్చిన తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు, పాలక వర్గ సభ్యులు భక్తులకు అన్ని వసతులు కల్పించారు. కొవిడ్ నిబంధనలు నడుమ స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరిపారు.
'ప్రముఖ శైవక్షేత్రమైన చెరువుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అంతకుముందు జరగాల్సిన గణపతి పూజా వంటి తంతులను మంగళవారం ప్రారంభించాం. బుధవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు అష్టమి తిథిలో స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల సమక్షంలో జరిగాయి. ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం.'
-ఆలయ పూజారి
ఇదీ చదవండి: 'యాదాద్రి పునర్నిర్మాణ పనులన్నీ పూర్తై... తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి'