నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. హాలియా- మిర్యాలగూడకు వెళ్లే రహదారిలో నిడమనూరు వద్ద నూతన బ్రిడ్జి పనులు జరుగుతున్న క్రమంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి కట్ట తెగిపోయింది. నిడమనూరు నల్లచౌట చెరువుకు వరద ఉద్ధృతి పెరగటం వల్ల తాత్కాలిక కట్ట తెగిపోయి ప్రమాదకరంగా మారింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మిర్యాలగూడ నుంచి హాలియా, నాగార్జునసాగర్, పెద్దవూర, దేవరకొండ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులను పోలీసులు నల్గొండ మీదుగా దారి మళ్లించారు. నిడమనూరు మండలం నుంచి బంకాపురం వెళ్లే దారిలో ఉన్న వాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బంటు వారి గూడెంలో వరద అధికంగా ఉండటం వల్ల గ్రామ ప్రజలు తాళ్ళ సాయంతో ఇళ్లకు చేరుతున్నారు.