కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో.. రాష్ట్రాలు, రైతులతో చర్చలు జరపాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణాది రైతులతో పాటు ముఖ్యంగా ఉత్తరాది రైతులకు నూతన వ్యవసాయ చట్టాల వలన పెను నష్టం జరుగుతుందన్నారు. అందువల్లే ఎముకలు కొరికే చలిలోకుడా ఆందోళనలు విరమించకుండా పోరాడుతూ.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు.
చర్చలు జరపాలి
విద్యుత్ చట్ట సవరణ బిల్లు వల్ల తెలంగాణలో 24గంటల ఉచిత కరెంటు ఆటంకం కలుగుతుందని తెలిపిన ఆయన .. కొత్త చట్టాల గురించి రాష్ట్రాలతో , రైతులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 75శాతం మంది రైతులు ఉన్న దేశంలో మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను ఏడిపించడం సబబు కాదన్నారు.
సంప్రదాయంగా ఉంటే బాగుంటుంది.
సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో రాగ్యానాయక్‌ను నక్సల్స్ హత్య చేస్తే ఆయన భార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'నిరుపేదల సొంతింటి కల తెరాస ప్రభుత్వంతోనే సాధ్యం'