Gundrampally fought against razakars : ప్రపంచ విప్లవోద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి నిజాం నిరంకుశ పాలనపై పడిలేచిన కెరటంలా... ఎరుపెక్కిన ఎన్నో ఊళ్లు... ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. రజాకార్ల వికృతచేష్టలు, దొరలు, దేశ్‌ముఖ్‌లు, పెత్తందార్ల అకృత్యాలకు తల్లడిల్లి.... దోపిడి, దౌర్జన్యాలపై చేసిన పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.... నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం.
Gundrampally fought against razakars in Nizam era : నిజాం సైన్యానికి, సాయుధ పోలీసు బలగాలకు ప్రతినిధిగా ఉండే ఖాసింరజ్వి ఆధ్వర్యంలో 1946లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థ... నాటి సర్కార్ అండతో వాలంటీర్లను నియమించింది. నిజాం పరిధిలో ఉన్న గ్రామాలలో రజాకార్లు ఆయుధాలను సమకూర్చుకొని... గడీలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడేవారు. పన్నులు చెల్లించని వారిపై దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండేవారు.
Gundrampally Story : ఈ తరుణంలోనే సూర్యాపేట తాలూకాలోని వర్ధమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అలియాస్ సైదిమోల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో బతుకుతెరువు కోసం వచ్చాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఏపూరు గ్రామంలోని ఓ భూస్వామి వద్ద పనిలో చేరిన సైదిమోల్.... కొద్ది కాలానికే రజాకార్లతో కలిసి దళసభ్యులను ఏర్పర్చుకున్నాడు. ఈ ప్రాంతంలోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.... గుండ్రాంపల్లిలో అనేక అరాచకాలు, మతమార్పిడులు, భూ ఆక్రమణలకు పాల్పడుతూ బురుజును నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడు.
దోపిడి, దౌర్జన్యాలతో మక్బూల్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోయాయి. ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, పంతంగి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన నాటి యువకులు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దళాలుగా ఏర్పడ్డారు. గుండ్రాంపల్లి కేంద్రంగా ప్రణాళికలు రూపొందిస్తుండే ఈ ఆత్మరక్షణ దళాలు రజాకార్ల మూకలపై దాడులకు పాల్పడ్డారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు నరరూప రాక్షసుడిగా మారాడు. మక్బూల్, అతని అనుచరులు వందల మంది యువకులను బంధించారు. వీరందరిని ఎడ్లబండికి కట్టేసి గుండ్రాంపల్లి నడిబొడ్డున ఉన్న బావిలో పడేసి సజీవదహనం చేశాడు.
ఈ ఘటనతో ఊళ్లకు ఊళ్లు ఒక్కసారిగా భగ్గమన్నాయి. దీంతో కమ్యూనిస్టు దళ నాయకులు పలివెల గ్రామానికి చెందిన కొండవీటి గుర్నాథరెడ్డి, వెలిమినేడుకు చెందిన తొట అంజయ్య, సీతంరాజు, కృష్ణంరాజు, బీబీ నగర్ బ్రాహ్మణపల్లికి చెందిన కోదండరాంరెడ్డి, మరికొందరూ సయ్యద్ మక్బూల్‌పై దాడులు చేయగా.... తప్పించుకొని హైదరాబాద్ పారిపోయాడు. సయ్యద్ మక్బూల్ కుటుంబాన్ని... తనకు సహకరించిన వారిని దళసభ్యులు మట్టుబెట్టారు.
రజాకార్ల చేతిలో అసువులుబాసిన అమరుల పేరిట సీపీఐ ఆధ్వర్యంలో 1993 జూన్ 4న స్మారక స్తూపాన్ని నిర్మించుకున్నారు. రహదారి విస్తరణలో స్తూపం కూల్చివేతకు గురికావడంతో పక్కనే మరో స్తూపాన్ని ఆవిష్కరించారు. ఏటా సెప్టెంబర్ 17న ఆనాడు జరిగిన సాయుధ పోరాట యోధులను స్మరిస్తూ, నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
- ఇవీ చదవండి : రూ.2వేల కోసం గొడవ.. భర్తను చావబాది, యాసిడ్ పోసిన భార్య
- వీళ్లు 'అగ్రి' ఆవిష్కర్తలు.. ఏం చేసినా అది అన్నదాత కోసమే..