హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి హరితశోభను సంతరించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాటిన మొక్కలు పెద్దవై చల్లని నీడనిస్తున్నాయి. రెండో విడత హరితహారంలో భాగంగా ఐదేళ్ల క్రితం 2016 జులై నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద స్వయంగా మొక్క నాటడమే కాకుండా.. ఆ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాటతో రహదారి వెంట పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వివిధ కంపెనీలు తమ వంతు బాధ్యతగా హరితహారంలో పాల్గొన్నాయి. చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు కార్యక్రమం యజ్ఞంలా సాగింది.
దారిపొడవునా పచ్చదనం..
ఫలితంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నవారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నాయి. క్రమపద్ధతిలో మొక్కలు నాటడంతో.. వరుసగా పెరిగిన చెట్లు కనువిందు చేస్తున్నాయి. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కోదాడ వరకు అదే వాతావరణం సాక్షాత్కరిస్తోంది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 16 వేలు, గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 12 వేలు మొక్కలను నాటారు. ఇలా ప్రతి గ్రామానికి లక్ష్యాన్ని నిర్దేశించి మొక్కలు అందజేశారు. పంచాయతీరాజ్, అటవీశాఖలు... రెండో విడత హరితహారం బాధ్యతలు చూశాయి. రహదారిపై ఖాళీ జాగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాటాలని లక్ష్యంగా పెట్టుకుని... కార్యాచరణ అమలు చేశారు. అయితే అటవీశాఖ దృష్టిపెట్టిన మొక్కలు మాత్రం బాగా పెరిగాయి. వాటికి కంచె వేయడంతో రక్షణ లభించింది.
మరింత శ్రద్ధ కనబరిస్తే.. పచ్చదనం పరిఢవిల్లేది..
అయితే మెుక్కల సంరక్షణలకు అధికారులు మరింత శ్రద్ధ కనబరిస్తే... ఇంకా పచ్చదనం పరిఢవిల్లేదని స్థానికులు చెబుతున్నారు. కొన్నిచోట్ల మొక్కలకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వాటిని పశువులు మేస్తున్నాయి. నాటిన మొక్కలకు పూర్తిస్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టి ఉంటే.. మరింత హరితమయ వాతావరణం కనిపించేదని స్థానికులు సూచిస్తున్నారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను రహదారికి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలకు అప్పగించి.. వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు వెచ్చిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటవీ విస్తీర్ణం పెంచాలని రూ.కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మెుక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ది గొప్ప సంకల్పం. హరితహారం కార్యక్రమం పేరిట పెద్దఎత్తున మొక్కలు నాటిస్తున్నారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం మా ఊరిలో నాటించిన మొక్కలు.. ఇప్పుడు చెట్లుగా ఎదిగాయి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి. మనం పెంచే ఈ చెట్లు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.-రాచకొండ కిష్టయ్య, గుండ్రాంపల్లి
ఇదీ చూడండి: GHMC: ఆకుపచ్చగా మారబోతున్న గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు!