ఇల్లు, వాకిలి కోల్పోయి పరిహారం ఇస్తారో లేదో తెలియక... నల్గొండ జిల్లాలోని కిష్టరాయన్ పల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నాంపల్లి మండలంలోని సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసంపై ఎటూ తేల్చకపోవడం వల్ల... లక్ష్మణాపురం గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. 174 ఇళ్లకు పరిహారం విషయంలో స్పష్టత లేకున్నా... జలాశయం నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు.
బాధితుల ఆవేదన
నల్గొండ జిల్లాలోని 3.1 లక్షల ఎకరాలకు నీరందించేందుకు... డిండి ఎత్తిపోతల కింద అయిదు ప్రాజెక్టుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్... 2015 జూన్ 12న శంకుస్థాపన చేశారు. సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. 5.7 టీఎంసీల కిష్టరాయన్ పల్లి పథకం పునరావాసం అంశం ఎటూ తేలకపోవడం... నిర్వాసితుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. 6 వేల 190 కోట్ల అంచనాతో చేపట్టిన జలాశయాల కోసం 9 వేల 927 ఎకరాలు సేకరించాల్సి ఉండగా... ఇప్పటివరకు 7 వేల 133 ఎకరాలు తీసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో కొన్ని భూములకు ఎకరాకు 5 లక్షల 15 వేలు... మరికొన్నింటికి 4 లక్షల 15 వేల చొప్పున చెల్లింపులు చేశారు. కానీ లక్ష్మణాపురం వాసులకు పరిహారం అందాల్సి ఉన్నా... అధికారుల్లో స్పందన లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే తమను పలకరించే వారు ఉండరంటున్న నిర్వాసితులు... గుడారాలు వేసుకుని నిరసనకు దిగారు. అయినా భారీగా పోలీసుల్ని మోహరించి... పనులు చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా పోరాటం
కిష్టరాయన్ పల్లి నిర్వాసితులు... ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 2018 జూన్ 26న... తొలిసారి పనులు అడ్డుకున్నారు. గుత్తేదారులు రాత్రి పూట పనులు చేస్తున్నారంటూ... నిర్వాసితులు అక్కడే టెంటు వేసుకుని దీక్షలు చేశారు. గత శుక్రవారం రాత్రి గుత్తేదారు... నిర్వాసితుల టెంటు తొలగించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసు బందోబస్తు నడుమ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 27న పోలీసులతో ఘర్షణ చోటుచేసుకోగా... పలువురికి గాయాలయ్యాయి. ఈ పరిణామాన్ని నిరసిస్తూ గత నెల 29న నిర్వాసితులు... కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అక్కడా తోపులాటలు జరిగాయి. తమకు మల్లన్నసాగర్ తరహాలో పరిహారం, పునారావాసమే లక్ష్యమని బాధితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
పరిహారం విషయంలో స్పష్టత వచ్చే వరకూ పనులు సాగనివ్వబోమని ముంపు బాధితులు తేల్చిచెబుతున్నారు.
ఇదీ చదవండి: టీకా ఉత్పత్తిలో హైదరాబాద్‌ది కీలకపాత్ర: గవర్నర్