Election Campaigns in Munugode bypoll: రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో అగ్రనేతలంతా తలమునకలయ్యారు. నామినేషన్ల పర్వం ముగియడం, ప్రచార గడువు సమీపిస్తుండడంతో ముఖ్య నేతల పర్యటనలు, బహిరంగసభల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికార తెరాస.. కార్యక్షేత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలను మండలాలు, ఊర్లవారీగా మోహరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓట్లు అడుగుతున్నారు.
'కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పి ఓట్లు అడగాలి': ఎనిమిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని.. ప్రధాని మోదీ ప్రకటనలకే పరిమితమయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాల కల్పనపై విమర్శలు చేస్తున్న భాజపా నేతలు.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
మునుగోడు మండలం కొరటికల్‌లో తెరాస కార్యకర్తలతో సమీక్షాసమావేశం నిర్వహించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మునుగోడు అభివృద్ధికి పైసా నిధులివ్వని కమలం నేతలకు ఓట్లడిగే హక్కు లేదని పువ్వాడ అన్నారు.
'దొంగ సంస్థల పేరుతో తెరాసనే ఈ గోడపత్రికలను వేయించింది': గులాబీ పార్టీకి దీటుగా కమలం నేతలు క్షేత్రస్థాయిలో చురుగ్గా కదులుతున్నారు. భాజపాను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక తెరాస నేతలు దొంగల్లా మునుగోడులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం నిర్వహించిన ఈటల.. మునుగోడులో వెలిసిన పోస్టర్లపై విమర్శలు గుప్పించారు. దొంగ సంస్థల పేరుతో తెరాసనే ఈ గోడపత్రికలను వేయించిందని ఆరోపించారు.
ఉపఎన్నికలు వస్తే తెరాస భయపడుతుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మునుగోడులో ఉపఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారానికి.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన బీసీల ఫెడరేషన్ , కార్పోరేషన్ నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
'గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిన చరిత్ర తెరాస సర్కార్‌దే': ఉపఎన్నిక ప్రచారాన్ని కాంగ్రెస్.. జోరుగా కొనసాగిస్తోంది. నేతలు ఇంటింటికి తిరుగుతూ.. పాల్వాయి స్రవంతికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోడు భూములు సర్కార్ లాక్కుంటోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిన చరిత్ర తెరాస సర్కార్‌దేనని ఆరోపించారు. కొత్త గ్రామపంచాయతీ లకు నిధులివ్వడం లేదని ఉపఎన్నిక ప్రచారంలో విమర్శించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క నాంపల్లి మండలం పెద్దాపురం, రాందాస్ తండాలో ప్రచారం చేశారు. అభివృద్ధిని కాంక్షించేవారంతా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేయాలని డప్పుకొట్టి మరీ మద్దతివ్వాలని కోరారు.
ఇవీ చదవండి: