నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి లక్షా 92 వేల 808 క్యూసెక్కుల వరద వస్తోంది. క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి, కుడి, ఎడమ కాల్వలతోపాటు ఏఎమ్మార్పీ కాల్వలకు కలిపి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. 8 క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు సాగర్‌లో నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులో 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను 589.80 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. 312.04 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
బుధవారం ఉదయం నుంచి సాగర్‌కు 1,95,215 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 18 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. నిన్న సాయంత్రం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టండంతో కేవలం రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్లీ స్వల్పంగా వరద ప్రవాహం పెరగడంతో 8 గేట్లను పాక్షికంగా ఎత్తివేశారు.
అటు పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో... 3 లక్షల 99 వేల 132 క్యూసెక్కులు కిందకు వెళ్తోంది. సాగర్ నుంచి పులిచింతలకు ఇన్ ఫ్లో మాత్రం లక్షా 13 వేల 705 క్యూసెక్కులుగా ఉంది. నీటిని విడుదల చేసే సమయంలో ఇవాళ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో... గేటు కొట్టుకుపోయి నీరు దిగువకు వెళ్తోంది. మరికొద్దిసేపట్లో నీటి విడుదలను భారీగా పెంచే అవకాశమున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. 6 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు వదలనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 45.77 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను పులిచింతల ప్రాజెక్టులో... 41 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి: online classes: పల్లెల్లో ఆన్‌లైన్ పాఠాలకు ఇక్కట్లు.. సిగ్నల్స్ అందక విద్యార్థుల అవస్థలు