కొద్ది నెలల క్రితం జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ప్రధానాంశంగా నిలిచిన నెల్లికల్ లిఫ్టు... సాంకేతికపరమైన అనుమతుల కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు కాగా... తుది దశగా పేర్కొనే సాంకేతికపరమైన అనుమతుల కోసం అధికారులు వేచిచూడాల్సి వస్తోంది. ఈ రెండు ప్రక్రియలు ముగిసిన తర్వాతే... టెండర్లు పిలుస్తారు. నెల్లికల్ ఎత్తిపోతలను ఏడాదిన్నరలోపు పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తానని... సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. అటు సీఎం కూడా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని హాలియా సభలో అన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు వెంటనే మోక్షం లభిస్తుందని ఆయకట్టదారులు ఆశతో ఉన్నారు. ఇదే క్రమంలో జూన్ కల్లా టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. దీనిపై గత మే నెలలోనే ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏయే గ్రామాల నుంచి నీటి సరఫరా జరగాలన్న దానిపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి అంచనాలు తయారు చేశారు. నీటి సౌకర్యం లేని పల్లెలన్నింటికీ నెల్లికల్ ద్వారా జలాల్ని చేరవేయాలన్న భావనతో పథకానికి రూపకల్పన చేశారు.
పాత పథకానికి పదింతలు...
నెల్లికల్ ఎత్తిపోతల పథకం అంచనాలు పదింతలు పెరిగాయి. గత ఫిబ్రవరి 10న ఈ పథకానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్.. ఈ పథకం శరవేగంగా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇంతకుముందున్న 4,400 ఎకరాల ఆయకట్టుతో చేపట్టాల్సిన లిఫ్టునకు గాను గతంలోనే ఒక ఏజన్సీకి టెండర్లు అప్పగించగా... వాటిని రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టును 4,400 నుంచి 24,886 ఎకరాలకు... రూ.78 కోట్లున్న వ్యయ అంచనాలను రూ.703 కోట్లకు పెంచింది. ప్రతి రోజు 370 క్యూసెక్కుల చొప్పున 3.8 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు ఆహ్వానిస్తారు.
సాగర్ వెనుక జలాల వద్ద రెండు పంపులు
సాగర్ వెనుక జలాల వద్ద రెండు పంపులు అమర్చి... ఒక పంపు నెల్లికల్ వద్ద, మరో పంపు సుంకిశాల తండా వద్ద నిర్మాణం చేపడతారు. నెల్లికల్ పాయింట్ వద్ద గల ప్రెజర్ మెయిన్-1 నుంచి నెల్లికల్, తిమ్మాయిపాలెం, చింతలపాలెం గ్రామపంచాయతీలతో పాటు వాటి పరిధిలోని అనుబంధ పల్లెల్లో... 15,499 ఎకరాలకు నీరందిస్తారు. సుంకిశాల తండా వద్ద గల ప్రెజర్ మెయిన్-2 పంపు ద్వారా సుంకిశాల, తునికినూతల, ఎల్లాపురం గ్రామ పంచాయతీలు అనుబంధ తండాల పరిధిలోని... 9,387 ఎకరాలకు నీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక తయారైంది. అటు రాజవరం మేజర్ చివరి భూములకు నెల్లికల్ ద్వారా 4,175 ఎకరాలకు నీటిని తరలిస్తారు.
25 గ్రామాలకు లబ్ధి
నెల్లికల్ ఎత్తిపోతల ద్వారా 25 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం చెంతనే ఉన్నా ఇంతకాలం నీటికి కటకటలాడిన తిరుమలగిరి మండలంలోని పల్లెలు... ఈ లిఫ్టు ద్వారా సస్యశ్యామలం కానున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి శంకుస్థాపన చేయడం... పూర్తి చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించడంతో... ఆయకట్టుదారుల్లో సంతోషం కనిపించింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపడతారని భావిస్తున్న పరిస్థితుల్లో... మూడు నెలల నుంచి అనుమతల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పరిపాలన, సాంకేతికపరమైన అనుమతులకు సాగునీటి శాఖ అధికారులు దస్త్రాలు పంపినా... రెండో అంశానికి సంబంధించి పై నుంచి ఆదేశాలు రాలేదు.
ఇదీ చదవండి: దారుణం: ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు