ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో... పంటలకు అపార నష్టం వాటిల్లింది. పొట్ట దశలో ఉన్న వరి నేలకొరగగా... పత్తి సైతం దారుణంగా దెబ్బతింది. దీనితో పెట్టుబడులు కోల్పోయి రైతులు... తీవ్ర వేదనలో ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 వరకు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే... 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం నల్గొండ శివారు ప్రాంతాలపైనా పడింది. దీనితో చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ... ముంపు బారిన పడ్డాయి. నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో... మొత్తం 3 వేల 6 వందల 12 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో నల్గొండ మండలంలో 2 వేల 5 వందల ఎకరాలు ఉండగా... కనగల్ మండలంలో 11 వందల 12 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పంటలు కోల్పోయిన రైతులు... తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ పంటలు వర్షం బారిన పడ్డాయి. నిడమనూరు మండలంలో వెయ్యి ఎకరాలు, అనుముల మండలంలో 7 వందలు, తిరుమలగిరి సాగర్లో 90, పెదవూర మండలంలో 40 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.
ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్