సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనినేని వీరభద్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో దివంగత మాలి పురుషోత్తం రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరోనా అతివేగంగా వ్యాప్తి చెందడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
పాశ్చాత్య దేశాల్లో కరోనా కట్టడికి వేగంగా చర్యలు తీసుకుంటుండగా మన దగ్గర మాత్రం అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదన్నారు. తక్కువ జనాభా కలిగిన అమెరికా లాంటి దేశాల్లో అవసరానికి మించి వ్యాక్సిన్లను నిల్వచేసుకొని ఉన్నారని చెప్పారు. వంద కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో వ్యాక్సినేషన్ ఇప్పుడే మొదలైందని.. అప్పుడే వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు.
కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి... కుంభమేళాకు అనుమతి ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల్లో అతి వేగంగా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. దీనికి మోదీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో నిన్న మొన్న జరిగిన ఎన్నికల వల్ల కూడా కరోనా కేసులు పెరిగాయని తెలిపారు.
ఇదీ చదవండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు