CPI Supports TRS in Munugodu By Election: మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే పటిష్ఠ ప్రణాళికలతో తెరాస, కాంగ్రెస్, భాజపాలు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఒకరిపై మరొకరు విమర్శల జల్లు కురిపిస్తూ మునుగోడు ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మునుగోడు పీఠాన్ని ఎలాగైనా అధిష్ఠించాలన్న పట్టుదలతో ఉన్న అధికార తెరాస ఓ అడుగు ముందుకేసింది. ఈ ఉపఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని సీపీఐని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సీపీఐ మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు మద్దతివ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Munugodu By Election Update : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి.. 2 గంటలపాటు చర్చించారు. ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాలని నేతలను కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాసకు మద్దతు ఉంటుందని సీపీఐ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎంతో భేటీ అంశాలపై పార్టీలో చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. మునుగోడులో ఇవాళ నిర్వహించే తెరాస సభకు సీపీఐ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తి మేరకు పల్లా వెంకట్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు.