వరుస ఓటములతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు నాగార్జున సాగర్ ఉపఎన్నిక సవాలుగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి పాలై తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్... సాగర్ ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో ముందుకు వెళ్తోంది. భాజపా అభ్యర్థి ప్రభావం ఇక్కడ అంతగా లేకపోవడంతో కాంగ్రెస్, తెరాసల మధ్యనే పోటీ రసవత్తరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెస్ విస్తృత ప్రచారం
జానారెడ్డి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందున అధికార పార్టీ ప్రభావం ఉండదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలతోపాటు ఇతర నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తుతున్నారు. కనీసం యాభైవేల ఓట్ల మెజారిటీతో గెలిచి తీరతామన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
తగ్గని తెరాస
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, జీహెచ్ఎంసీలో ఆశించిన స్థానాలు రాకపోవడంతో అధికార పార్టీ తెరాస అప్రమత్తమైంది. పట్టభద్రుల మండలి ఎన్నికలను సవాల్‌గా తీసుకుని రెండు స్థానాలను చేజిక్కించుకుంది. తాజాగా సిట్టింగ్ స్థానంలో ఉపఎన్నిక జరగనుండగా నోముల నర్సింహయ్య కుమారుడినే బరిలోకి దింపింది. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసి విజయం సాధించాలన్న దిశలో ముందుకు వెళ్తోంది.
పోలింగ్ కీలకం
పోటాపోటీగా బలం ఉన్న ఈ ఉప ఎన్నికలో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది. ప్రచారం ముగిసిన తర్వాత గ్రామాల వారీగా, తండాలా వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాన్ని పెంచాల్సి ఉంది. ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ఎవరు ముందుకు వెళ్తారో వారిదే గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సర్వత్రా ఉత్కంఠ
ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ గ్రామాల వారీగా, మండలాల వారీగా మకాం వేసి స్థానిక నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వివిధ వర్గాల వారీగా ఓటర్లను సమీకరించుకుని తమవైపు తిప్పుకునే రాజకీయ ప్రయత్నాలు శరవేగంగా నడుస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉందన్న ప్రాంతాలపై అధికార పార్టీ కన్నేసిందని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలుపు రాబోవు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్.. సాగర్ స్థానాన్ని చేజారకుండా సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఇదీ చదవండి: