MUNUGODE CONGRESS CANDIDATE: మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిపై కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోతోంది. నెలాఖరుకు ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల్లో ఎవరికి టికెట్దు దక్కుతుందో తెలియక.. వారు కూడా క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు పని చేయడం లేదు. పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిన తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపా అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనకు గతంలో ఉన్న పరిచయాలతో మండల, గ్రామ స్థాయి నాయకులను పిలిపించుకుని మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నారు. తెరాస అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేట్లు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీలైనంత త్వరగా ప్రకటించాలి..: కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్‌లో మాదిరి.. చివరి వరకు కాకుండా వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో శ్రేణుల్లో భరోసా కల్పించాలని భావిస్తోంది. ఇటీవల దిల్లీలో ప్రియాంక గాంధీ వద్ద జరిగిన సమావేశంలో కూడా అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ అభ్యర్థి ఎంపికపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతో సమావేశమయ్యారు. మరుసటి రోజు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత దామోదర్‌రెడ్డిలు నలుగురు ఆశావహులతో సమావేశమయ్యారు. టికెట్ కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని.. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయం కూడా జోడించి.. అభ్యర్థి ఎంపికకు చెందిన వివరాలను ఏఐసీసీకి నివేదించినట్లు తెలుస్తోంది.
పార్టీలో గందరగోళం..: మొత్తం నలుగురు పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతలు ఆశావహుల్లో ఉండగా.. వీరిందరి బలాబలాలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం సర్వేలు నిర్వహించింది. ఆ నివేదికలతో పాటు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీకి పంపిన నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నివేదిక దిల్లీ చేరకుండానే.. మూడు రోజుల కిందట పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసినట్లు మీడియాలో రావడంతో.. పార్టీలో కొంత గందరగోళానికి దారి తీసింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో క్యాడర్ కొంత అయోమయంలో పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వేగం పెంచాలి..: భాజపా, తెరాసలు దూకుడుగా వెళ్తున్న సమయంలో.. ఇప్పటికైనా పీసీసీ వ్యూహాల్లో వేగం పెంచాలని శ్రేణులు కోరుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై క్యాడర్లో అయోమయాన్ని, ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠను తొలిగించాలని మునుగోడు హస్తం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి..
మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోన్న హస్తం
కానిస్టేబుల్ అభ్యర్థులను ఆ ప్రచారం నమ్మొద్దంటున్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్