సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామంలో దసరా ఉత్సవంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తెరాస వర్గీయులు ఒకరిపై ఒకరు కర్రలతో జాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఎనమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన బాధితులు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని అర్వపల్లి ఎస్సై అలీమా బేగం వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలో కాంగ్రెస్, తెరాస వర్గీయులమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతీ దసరా ఉత్సవంలో... పూజ అనంతరం మొదటి కంకణం గ్రామ పూజారికి, రెండవ కంకణం గ్రామ పెద్దకు కడుతారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. కానీ ఇటీవల ధర్మాపురం గ్రామం.. మోత్కూరు మున్సిపాలిటీలో విలీనమై... అనంతరం 10వ వార్డులో కలిసింది. ఆ వార్డు కౌన్సిలర్ దసరా ఉత్సవంలో మొదటి కంకణం తనకే కట్టాలని... ధర్మాపురం గ్రామస్తులతో వాగ్వావాదానికి దిగాడు. గ్రామస్థులు మొదటినుంచి వస్తున్న ఆచారం మార్చడం సరికాదని... మొదటి కంకణం పూజారికి, రెండవ కంకణం గ్రామ పెద్దకు మూడవ కంకణం కౌన్సిలర్‌కు కడతామని తెలిపారు. దీంతో అక్కడ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జనాలను చెదరగొట్టారు.
ఇదీ చూడండి: DEVARAGATTU: బన్నీ ఉత్సవంలో చెలరేగిన హింస... వందమందికిపైగా గాయాలు